సుబేదారి/పాలకుర్తి రూరల్, ఆగస్టు12: ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి చిక్కాడు. సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారి కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నీటిపారుదల శాఖ పాలకుర్తి సబ్ డివిజన్లో గుగులోత్ గోపాల్ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గోపాల్‌ను ప్రభుత్వం గుడికుంట తండా, మంచుప్పుల, చెన్నూరు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా నియమించింది. గుడికుంట తండా తాజా మాజీ సర్పంచ్ బానోత్ కాంతి, ఆమె భర్త యాకూబ్‌నాయక్ దంపతులు గ్రామాభివృద్ధికి రూ.75వేలు ఖర్చు చేశారు. ఇందుకు సం బంధించిన బిల్లుల కోసం గ్రామ ప్రత్యేకాధికారి గోపాల్‌ను యాకూబ్‌నాయక్ కలవగా తనకు రూ. 10వేలు ఇస్తేనే సంతకం చేస్తానని చెప్పాడు.
దీంతో ఆయన విసుగు చెంది శుక్రవారం రూ.6వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్ట ఎస్బీఐ సమీ పంలో రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ గోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని రెండు గంటలపాటు విచారించినట్లు తెలిసింది.