వర్ధన్నపేట, మే 29 : ఓ రైతు మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది. మరో ఏడాది ఇలాగే కాపాడుకుంటే తొలిపంట చేతికొస్తుందన్న ఆనందం ఆవిరైపోయింది. పంటల అవశేషాలను కాల్చేందుకు పెట్టిన మంట తీరని నష్టాన్ని మిగిల్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపెల్లి లోకేశ్వర్‌రావు ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్‌పామ్ మొక్కలు నాటాడు. డ్రిప్ ఏర్పాటు చేసుకొని నీరు, ఎరువులు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి.
వచ్చే సంవత్సరం నుంచి కాపు ప్రారంభం కానున్నది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని రైతులు పంటల అవశేశాలకు నిప్పటించడంతో అదిక్రమంగా లోకేశ్వర్‌రావు ఆయిల్‌పామ్ తోటకు అంటుకొని మొక్కలు దగ్ధమయ్యాయి. ఏపుగా పెరిగి కాపు దశకు చేరుకున్న 8 ఎకరాల్లోని ఆయిల్‌పామ్ మొక్కలు 80శాతానికి పైగా కాలి బూడిదయ్యాయి. గురువారం సాయంత్రం తోటకు మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు కూడా వీలులేకుండా పోయింది. శుక్రవారం ఉదయం తోటలోకి వెళ్లి చూసే సరికి మొక్కలు, తోటలోని డ్రిప్ పైపులు, సైఫన్ పూర్తిగా కాలిపోయి కనిపించింది. దీంతో రైతు లబోదిబోమంటూ తోటమొత్తం తిరిగి చూస్తే మొక్కలు కాలిపోయి ఉన్నాయి.
చేసేదేమీలేక భోరున విలపిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పక్క రైతులు, కుటుంబ సభ్యులు తోట వద్దకు చేరుకొని కాలిపోయిన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే స్థానికుల సూచన మేరకు లోకేశ్వర్‌రావు వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మంటల కారణంగా సుమారు రూ.12లక్షల వరకు లోకేశ్వర్‌కు నష్టం జరిగిందని స్థానిక రైతులు తెలిపారు. అధికారులు తోటను పరిశీలించి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూడాలని రైతు లోకేశ్వర్‌రావు కోరారు. పంట అవశేషాలను కాల్చొద్దని పదే పదే చెబుతున్నా కొందరు రైతులు వినకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
మహబూబాబాద్ రూరల్, మే 29 : ఓ రైతు మక్క కొయ్యలకు నిప్పు పెట్టగా, ఆ మంటలు వ్యాపించి శ్రీగంధం చెట్లు కాలిపోయిన ఘటన మహబూబాబాద్ మండలంలో శుక్రవారం జరిగింది. రైతు గుగులోత్ వీరన్న కథనం ప్రకారం.. రైతు గుగులోత్ వీరన్న మల్యాల గ్రామ శివారు చోక్లాతండాలో 2016లో తన పట్టా భూమిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను నాటాడు. 10 సంవత్సరాల నుంచి వాటిని కాపాడుకుంటున్నాడు. గురువారం రాత్రి పక్క పొలం రైతు అజాగ్రత్తగా మక్కల కొయ్యలకు నిప్పు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మంటలు ఎగిసిపడి గాలికి పక్క చేనులోకి మంటలు వ్యాపించి శ్రీ గంధం, ఎర్రచందనం మొక్కలు 71 వరకు కాలిపోయాయి. సుమారు రూ.30లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. చాలా రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తున్న శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు మాడి పోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వీరన్న కోరారు.