హనుమకొండ చౌరస్తా, జూన్ 5 : కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తిన్నది కక్కించకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రాంచం ద్రం తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. కేయూ హాస్టళ్ల నిర్వహణ, టెండర్లు లేకుండానే కొనుగోళ్లు, ని బంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్ చెల్లింపులపై విచారణ కమిటీలు అవతవకలను గుర్తించాయి. రెండు నెలల్లోనే అడ్వాన్స్‌ల పేరిట రూ.23 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు వీసీ ఆదేశాల మేరకు మాజీ హాస్టల్ డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్‌తో పా టు 18 మంది జాయింట్ డైరెక్టర్లు, కేర్ టేకర్లు, ఉద్యోగులకు రిజిస్ట్రార్ షాకాజ్ నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాస్టళ్ల నిధులను గత హాస్టల్ డైరెక్టర్ దారి మళ్లించాడు. కోట్ల రూపాయల కిరాణ కొనుగోళ్లు, పెండింగ్ బిల్లులు, లెక్కలు లేని అడ్వాన్స్‌లు, వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. విద్యార్థుల కడుపు నింపేందుకు ఇచ్చే నిధులను గత హాస్టల్ డైరెక్టర్ తిన్నారు. మహిళా హాస్టల్ నిర్వహణ కోసం జాయింట్ డైరెక్టర్లకు అడ్వాన్స్‌ల రూపంలో హాస్టల్ ఆఫీసు నుంచి రూ.లక్షల్లో డబ్బులు బదిలీ చేసి ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ల నుంచి హాస్టల్ మాజీ డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ తన వ్యక్తిగత అకౌంట్లోకి ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నట్లు గతంలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేసిన విచారణ కమిటీలు ఆధారాలు సేకరించి నివేదిక ఇవ్వగా హాస్టల్ మాజీ డైరెక్టర్ సహా 18 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వ్యక్తిగత ఖాతాలకు నిధుల బదిలీ నుంచి దొంగ బిల్లులు, రూ.లక్షల్లో అడ్వాన్స్‌లు, అనుమతులు లేని టెండర్లు, అడ్డా లేబర్ల పేరిట చెల్లింపుల వరకు వెలుగులోకి వస్తున్నాయి. కోట్ల రూపాయల కిరాణా కొనుగోళ్లు జరిగాయని రికార్డులు చెప్తుంటే, మరో వైపు సరఫరాదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
కేయూ హాస్టల్ డైరెక్టర్ పదవి అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. యూనివర్సిటీలో ఎక్కువగా అక్రమాలు జరిగేది హాస్టళ్లలోనే. అందుకే హాస్టల్ డైరెక్టర్‌గా చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారనే ఆరోపణలు బాహటంగానే వినిపిస్తున్నాయి. విద్యార్థుల భోజనంలో నాణ్యత లేకపోవడం, మెనూ పాటించకుండా టిఫిన్లు, కుల్లిపోయిన కూరగాయలు, నాసిరకమైన కిరాణా సరుకులు వాడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. హాస్టల్ డైరెక్టర్లు గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వీసీ, రిజిస్ట్రార్ కమిటీలు వేసి విచారణ చేసి వదిలేయడం షారా ‘మూముళ్లు’గా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిధుల ఖర్చుల్లో మాత్రం కోట్లలో లెక్కలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాపు జరిపి అవినీతి అధికారులు తిన్నది కక్కించాలని, వారిని విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.