ములుగు, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సంచులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన రైతులకు సంచులు అందక ఇబ్బందులు పడుతుంటే, తెరచాటున మాత్రం గన్నీ బ్యాగుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా సాగుతున్నది.
ఇందుకు ఉదాహరణగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లోని కొనుగోలు కేంద్రం నిలుస్తుంది. రామాంజాపూర్లో కొన్నేళ్లుగా ఐకేపీ ద్వారా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు మాయమైనట్లు తెలిసింది. 2024-2025 వానకాలం సీజన్లో సుమారు 3 వేల గన్నీ సంచుల తేడా వచ్చినట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన అనంతరం సివిల్ సప్లయ్స్ అధికారులకు కేంద్రాల నిర్వాహకులు గన్నీ బ్యాగుల లెక్కలు సమర్పించాల్సి ఉండగా, ఇక్కడి నిర్వాహకులు మాత్రం రెండు సీజన్ల నుంచి లెక్క అప్పగించలేదు.
దీంతో ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో అధికారులు సదరు నిర్వాహకులను రూ. 2,74,000 విలువైన గన్నీ బ్యాగులను అప్పగించాలని ఆదేశించారు. సంచు లు తిరిగి ఇవ్వకుంటే అంతకు విలువైన నగదును సంఘం ద్వారా చెల్లించాలని, లేకపోతే ఈ సీజన్లో కొనుగోలు ప్రక్రియకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ విషయమై ఏపీఎం ధర్మేందర్ను వివరణ కోరగా.. గతంలో గన్నీ బ్యాగులు పక్కదారి పట్టిన మాట వాస్తవమేనని, రికవరీ చేసేందుకు సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.