వరంగల్, మార్చి 8(నమస్తేతెలంగాణ) : ఈ నెల 6 నుంచి 8 వరకు ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో సంబురాలు నిర్వహించాలని మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం జిల్లాలో సంబురాలను ప్రారంభించారు. తొలిరోజు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు, ఫ్లెక్సీలకు రాఖీలు కట్టారు. రెండోరోజు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి కలిశారు. మూడోరోజు మంగళవారం మహిళలతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి సంబురాలు జరిపారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని బొల్లికుంట సమీపంలోని ఫంక్షన్‌హాళ్లలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మె ల్యే అరూరితో కలిసి స్వయం సహాయక సంఘాల మ హిళలకు మంత్రి రూ.54 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. వివిధ రంగాలకు చెందిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ పెద్ద దిక్కులా, మేనమామలా మారిండని పేర్కొన్నారు. వడ్డీలేని రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం గొప్ప పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఆడపిల్ల పుడితే బాధపడే స్థాయి నుంచి ఆనందపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు. అనంతరం రాయపర్తిలో జరిగిన వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి హాజరై 4,485 స్వయం సహాయక సంఘాలకు రూ.46 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట స్టార్టప్ విలేజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఆవిష్కరించారు. మహిళలకు వాటర్ బాటిళ్లను, దివ్యాంగులకు ట్రై మోటరు సైకిళ్లను అందజేశారు. పశు సంవర్థక కిట్‌ను ఆవిష్కరించారు. మ హిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికారతలో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉందని అన్నారు. అభయహస్తం ద్వారా పొదుపు చేసిన రూ.545 కోట్లను స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండ ల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు మహిళలకు వివిధ క్రీడ లు నిర్వహించారు. ఎమ్మెల్యే, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న వివిధ మండల కేంద్రాలను సందర్శించి మహి ళా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ క్రీడోత్సవాల్లో ఆరు వేల మందికిపైగా మహిళలు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వరంగల్ బన్న ఒమేగా హాస్పిటల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో నర్సంపేటలో మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసీడీఎస్, మెప్మా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది మున్సిపల్ మహిళా కార్మికులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలను సన్మానించారు. అంతకుముందు నర్సంపేట క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి పథ కం లబ్ధిదారులకు రూ.1.28 కోట్ల విలువైన చెక్కులకు అందజేశారు. నెక్కొండలో ఐఎంఏ ఉమెన్ విభాగం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ది స్వప్ప ప్రారంభించారు.
ఖిలావరంగల్‌లోని ఖుష్‌మహల్ గ్రౌండ్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్- వాణి దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవం గా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటోషో, ప్రముఖ సింగర్ మధుప్రియ, బుల్లెట్ బండి ఫేమ్ మోహన బోగరాజుల పాటలు అలరించాయి. విద్య, వైద్య, కళలు, సేవ తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం, అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.