గిర్మాజీపేట, మార్చి 5: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనట్లు డీఐఈవో శ్రీధర్‌సుమన్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ తెలుగు/సంస్కృతంలో (5175/5372) 197, ఒకేషనల్ కోర్సులో (824/894) 70 మందితో కలిపి మొత్తం 267 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో తెలిపారు. వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో సంస్కృతం పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థిని డిబార్ చేసినట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందాలు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయని డీఐఈవో పేర్కొన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ఎల్బీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఏసీపీ నందిరాంనాయక్, మట్టెవాడ సీఐ గోపి, సిబ్బంది ఉన్నారు.
నర్సంపేట/గీసుగొండ/ఖానాపురం/రాయపర్తి: మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. నర్సంపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీఎస్ఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ ఒకేషనల్ కాలేజీ, లక్నేపల్లిలోని బాలాజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్ష రాశారు. అలాగే, గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, కేజీబీవీలో 325 మందికి 8 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ చందా రమణాకర్ తెలిపారు. ఖానాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 152 మందికి 143 మంది హాజరయ్యారు. సంగెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 239 మందికి 234 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ కుమారస్వామి తెలిపారు. రాయపర్తిలోని శ్రీమల్లెల వెంకటేశ్వర్రావు స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 190 మంది విద్యార్థులకు 188 మంది పరీక్ష రాశారు.
నెక్కొండ: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని చివరి క్షణాల్లో పోలీసుల సహకారంతో పరీక్ష రాసింది. మండలంలోని తోపనపల్లికి చెందిన విద్యార్థి రాజేశ్వరి నెక్కొండలోని మోడల్ స్కూల్లో పరీక్ష రాయాల్సి ఉంది. కానీ, బాలిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంది. మరో ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై గమనించి కానిస్టేబుల్ బానోత్ తిరుపతి ద్వారా బాలికను బైక్‌పై మోడల్ స్కూల్‌కు చేర్చారు. గ్రేస్ పీరియడ్‌లో విద్యార్థిని కేంద్రానికి చేరుకొని ఊపిరి పీల్చుకుంది. ఎస్సై మహేందర్, కానిస్టేబుల్ తిరుపతిని అధ్యాపకులు అభినందించారు.