సుబేదారి, ఆగస్టు 26 : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ ఏసీపీ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ సీఐలు, కొంత మంది సిబ్బంది మంత్రి అనుచరులతో కలిసి చేసిన హంగామా మరువకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సొంత పనికి ఇద్దరు సీఐలు ఎస్కార్ట్‌గా వెళ్లడం విమర్శలకు దారి తీసింది.
సోమవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శ్రీపతిపల్లి గ్రామానికి అనుచరులతో కలిసి మురళీధర్‌రావు దైవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు వీవీఐపీ స్థాయిలో ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ సీఐలు శివకుమార్, మల్లయ్య ఎస్కార్ట్ డ్యూటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఎస్సై, సీఐ, ఏసీపీ స్థాయి అధికారులు అధికార పార్టీ నేతల అండతో పోస్టింగ్ పొందిన తర్వాత వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసు శాఖ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌డ్యూటీలో ఉండి ప్రైవేట్ డ్యూటీ చేయడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇదేనా పోలీసింగ్ అని ప్రశ్నిస్తున్నారు.