చెన్నారావుపేట, ఫిబ్రవరి 8: మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అందె స్పందన కేవలం రూ.300లతో గాయపడిన వారి కోసం ఇన్నోవేటివ్ హ్యాండ్ రెస్ట్ ఫర్ ఫ్రాక్చర్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు గైడ్ టీచర్ బాలాజీరావు గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో 122 ఇన్నోవేషన్స్‌ను విద్యార్థులు ప్రదర్శించగా అందులో 10 రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు డీఈఓ వాసంతి ప్రకటించారు. అందులో ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాల పరికరం ఎంపికైనట్లు హెచ్ఎం జయ తెలిపారు.
ఈ పరికరం ఉపయోగాలను విద్యార్థి స్పందన వివరించింది. ప్లాస్టిక్ పైప్‌లతో హ్యాండ్ రెస్ట్ అనే పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపింది. చేయి విరిగినప్పుడు డాక్టర్లు వేసిన సిమెంట్ పట్టి బరువుగా ఉండి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని చేతికి గాయమైన వారు సులభంగా ఉపయోగించుకోవచ్చు. కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు గాయపడిన చేతిని ఈ పరికరంపై ఉంచి సేదతీరవచ్చని, అలాగే పరికరాన్ని రకరకాల ఎత్తులో వాడుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ బాలాజీరావు, విద్యార్థి స్పందనను ఉపాధ్యాయులు అభినందించారు.