– సారపాక మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో ఘటన
– రెండుసార్లు ఘటన జరిగినా స్పందించని ఉన్నతాధికారులు
– గుట్టుచప్పుడు కాకుండా నలుగురు విద్యార్ధినులకు చికిత్స
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సారపాక తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల, వసతి గృహం ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 160 నుంచి 200 వరకు విద్యార్దినులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన రాత్రి సమయంలో వసతి గృహంలో విద్యార్ధినుల కాళ్లపై ఎలుకలు దాడి చేశాయి. నలుగురు విద్యార్ధినులు దాడికి గురవ్వగా సమాచారం బయటకు తెలియనీయకుండా వసతిగృహం సిబ్బంది, కళాశాల యాజమాన్యం కలిసి దాడికి గురైన విద్యార్ధినులను వైద్య చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ టీటీ ఇంజక్షన్ చేయించి తిరిగి గుట్టుచప్పుడు కాకుండా కళాశాలకు తీసుకువెళ్లారు.
మైనార్టీ కళాశాల వసతిగృహంలో విద్యార్ధినులపై ఎలుకలు దాడి చేయడం ఇది రెండవసారి. ఇదే నెలలో 3వ తేదీన ముగ్గురిని ఎలుకలు గాయపర్చగా తాజాగా 9వ తేదీన నలుగురు విద్యార్ధులపై ఎలుకలు దాడి చేయడం కళాశాల, వసతిగృహ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తుంది. వసతి గృహంలో పదే పదే విద్యార్ధినులపై ఎలుకలు దాడిచేస్తున్నా ఉన్నతాధికారులు కళాశాల యాజమాన్యం, వసతి గృహం ఇన్చార్జి పనితీరును పట్టించుకోకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
విద్యార్థినులపై ఎలుకల దాడి విషయమై సారపాక మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా సంఘటన జరిగిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్ధినులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించామని తెలిపారు. ఎలుకలు డ్రైనేజీ నుండి వస్తున్నాయన్న విషయాన్ని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లి ఎలుకలు రాకుండా డ్రైనేజీని క్లోజ్ చేయించి చర్యలు తీసుకున్నామని వివరణ ఇచ్చారు. ఎలుకల దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారా లేదా అని అడగ్గా చిన్న విషయమే కదా అని చెప్పలేదని చెప్పడం పట్ల పిల్లల ఆరోగ్యంపై ఏ మేరకు శ్రద్ధ చూపుతున్నారో స్పష్టమవుతోంది.