Ameesha Patel | బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్ కుటుంబానికి చెందిన ముంబైలోని చర్చ్‌గేట్ నివాసంలో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఆమె నివాసంలో రూ. 5 లక్షల విలువైన వజ్రాలు పొదగబడిన బంగారు గాజు చోరీకి గురైన ఘటనపై అమీషా మేనేజర్ మరియు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఆమె ఇంట్లో గత 18 నెలలుగా గృహకార్మికురాలిగా పనిచేస్తున్న 40 ఏళ్ల సీమా ఘాటేను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జనవరి నెలలో అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్ తమ ఇంట్లో విలువైన ఆభరణాలు మిస్ అయినట్లు గుర్తించారు. ఈ చోరీకి ఇంట్లో పనిచేసే సీమా ఘాటేపైనే అనుమానం ఉండటంతో, ఆమెను పలుమార్లు నగలు వెనక్కిఇవ్వాలని కోరారు. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్ డిటెక్షన్ బృందం గాలింపు చర్యలు చేపట్టి నిందితురాలు సీమా ఘాటేను విరార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆమెను ముంబై కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెను సెప్టెంబర్ 15 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం పోలీసులు దొంగిలించిన ఆభరణాలను రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఈ చోరీ వెనుక ఆమెకు ఎవరైనా సహచరులు ఉన్నారా లేదా అనే కోణంలోనూ, ఆమె పూర్వాపరాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై అమీషా పటేల్ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, అమీషా పటేల్ చివరిసారిగా సన్నీ డియోల్ సరసన నటించిన ‘గదర్ 2’ (2023) చిత్రంలో కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఆమెకు మంచి రీఎంట్రీని అందించింది.