అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అందుకు భిన్నంగా ఉంటున్నది. అసలైన పేదల పేర్లు కాకుండా అనర్హుల పేర్లు జాబితాలో చేరిపోతుండడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇల్లు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేస్తున్నారంటూ రోజుకో చోట జనం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుండడంతో అంతటా గందరగోళం నెలకొంది.
అంతేగాక ఇందిరమ్మ కమిటీలోని నాయకులకు డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారంటూ సర్వే వచ్చిన అధికారులను జనం నిలదీస్తుండడం సర్వసాధారణమైంది. ఇదిలా ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో అధికారులకు తెలియకుండానే జాబితాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుండగా, అర్హులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు.
– మహబూబాబాద్/జనగామ, మే 2(నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదిలోనే అట్టర్‌ప్లాప్ అయింది. జనగామ జిల్లాలో నియోజకవర్గం యూనిట్‌గా ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున గృహాలు మంజూవుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఎనిమిది పైలట్ గ్రామాలు పోగా మిగిలిన గ్రామాలకు గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే జరుగుతున్నది.
అయితే గతంలో ఇల్లు మంజూరైనా నిర్మాణం పూర్తిచేయకుండా ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటున్న దరఖాస్తుదారుడి పేరు అర్హుల జాబితాలో చేరింది. ఇలా చాలామంది అనర్హుల పేర్లు ఎల్-1, ఎల్-2లో ఉన్నాయి. అదీ గాక కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వారి పేర్లు అర్హుల జాబితాలోకి ఎక్కించారు. అంతేగాక ఇతర రాష్ర్టాలు, పక్క జిల్లాల్లో ఆస్తి, పాస్తులుండి స్థానిక ఆధార్‌కార్డుతో దరఖాస్తు చేసుకున్న వారి పేరు జాబితాలో ప్రత్యక్షమవుతుండడంపై ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. తాము చెప్పిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సర్వే చేస్తున్న జాబితాలో తమకు సమాచారం లేకుండానే పేర్లు ఎలా వచ్చాయో తెలియని గందరగోళ పరిస్థితి ఉందని వారు అంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అర్హులను గుర్తించేందుకు జనగామలో ఇటీవల మరో సర్వే చేపట్టారు. ఇప్పటికే మూడుసార్లు వివిధ జాబితాలతో లబ్ధిదారులను ఎల్-1, ఎల్-2గా గుర్తించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన వర్తింపజేసేందుకు వచ్చిన జాబితాపై సర్వే ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. వెబ్సైట్లో 418 మంది వివరాలు ఉంటే అదనంగా 80 పేర్లు జాబితాలో చేరాయి.
వారి వివరాల కోసం వార్డుల్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఇంతలో ఇందిరమ్మ కమిటీల సిఫారసుతో 500 మందితో తాజాగా మరో జాబితా వచ్చింది. లబ్ధిదారుల జాబితాను వార్డుల వారీగా వేరు చేసి అధికారులతో సర్వే చేయించి రూపొందించిన లబ్ధిదారుల వివరాలతో అధికారులు మళ్లీ తిరిగి పరిశీలిస్తున్నారు. గతంలోని వివరాలకు, ప్రస్తుత జాబితాలోని వివరాలకు పొంతన లేకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు 3500 చొప్పున 7వేల ఇళ్లు మంజూరయ్యాయి. అయితే గ్రామసభలు నిర్వహించిన సమయంలో ఒక జాబితా ఉంటే.. ఇల్లు వ చ్చిన తర్వాత అందులో చాలామంది అర్హులను తొలగించి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే అర్హుల జాబితాలో చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే జాబితాలో పేరు వచ్చిందని చాలామంది ఉన్న గుడిసెలు, పెంకుటిళ్లు, రేకులు తీసేసి ఇండ్లు నిర్మించుకుందామని ఎదురుచూస్తున్నారు. అర్హుల జాబితాలో పేర్లు లేకపోవడంతో చా లామంది నిరాశకు గురవుతున్నారు. మొదటి విడత లో గ్రామసభ నిర్వహించినప్పుడు ఒక గ్రామానికి 150 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పిన అధికారులు ఇప్పుడు కేవలం 15 నుంచి 20 ఏళ్లు మాత్రమే వ చ్చాయనడంతో నిజమైన లబ్ధిదారులు కంగుతిన్నా రు. ఇప్పటికైనా అధికారులు అర్హులను జాబితాలో చేర్చి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పోయిన ఏడాది ఆగస్టులో, సెప్టెంబర్ నెల ల్లో కురిసిన భారీ వర్షాలకు నా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇల్లు కూలిన వా రం లోపట నెల్లికుదురు ఎమ్మార్వో దగ్గరికి పోయి అర్జీ పెట్టుకున్నా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్న డు. ఆ తర్వాత ప్రజాపాలన, గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు ఇచ్చిన. ఎవరెవరికో ఇల్లు ఇచ్చిన్రు.. నాకు మాత్రం రాలే. కలెక్టర్ సారూ నాకు కూడా ఇల్లు ఇప్పించాలని కోరుతున్నా.
– బొల్లు ముత్తయ్య, బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా