ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడ్డాడు. అప్పటికే తన ఇల్లు మంటల్లో కాలిపోయిందని అధికారులకు ఫొటోలు కూడా చూపించి దరఖాస్తు చేశాడు. కానీ లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తెలిసి తట్టుకోలేకపోయాడు. అన్ని విధాలా తనకు అర్హత ఉన్నా పేరు ఎందుకు చేర్చలేదని.. పైగా అనర్హులకు ఎలా ఇస్తారంటూ జనవరి 23న ప్రజాపాలన గ్రామసభలో అధికారులను నిలదీశాడు. తన చావుతోనైనా గ్రామంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని దీనంగా వేడుకుంటూ కుమ్మరి నాగేశ్వరరావు(45) తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 15 రోజులుగా దవాఖానలో మృత్యువుతో పోరాడుతూ గురువారం కన్నుమూయడంతో ఇప్పుడా కుటుంబం వీధినపడింది. ఈ సంఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొత్తూరులో పెను విషాదం నింపింది. కాగా నాగేశ్వరరావుది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు హత్యేనని, మృతికి బాధ్యత వహించి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపికచేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యమే అతడి ప్రాణంతీసిందని స్థానికులు మండిపడుతున్నారు.
– కన్నాయిగూడెం, ఫిబ్రవరి 6
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండ లం బుట్టాయిగూడెం జీపీ అనుబంధ గ్రామమైన కొత్తూరుకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు(నాగయ్య) అనే దళితుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ జాబితాలో తన పేరు రాకపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇదివరకే తన ఇల్లు పూర్తి గా కాలిపోయిందని తన ఇల్లు మంజూ రు చేయాలని వేడుకుంటూ ఫొటోలను అధికారులకు చూపెట్టాడు. అలాగే గ్రామంలో 90శాతం మంది అర్హులు ఉంటే వీరికి కా కుండా అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని అధికారులను నిలదీశాడు. ఇక తనకు ఇ ల్లు రాదనుకొని కుమిలిపోయాడు.. తనకు రాకపోయినా గ్రామంలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని అధికారులను వేడుకుంటూ ప్రజాపాలన గ్రామసభ జరుగుతుండగానే అధికారుల ముందే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. 15 రోజులుగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొం దుతున్నాడు.
బుధవారం పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. కాగా మృతదేహాన్ని గ్రామానికి తీసుకొస్తుండడంతో గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ముందస్తుగా ఇద్దరు ఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులను కాపలాగా ఉంచారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు స్పందించారు. నాగేశ్వరరావుది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముందుగా మృతుడికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. 15 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ అచేతన స్థితిలో ఉన్న నాగేశ్వరరావును అధికారులు, నాయకులు పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. దీనిని రాజకీయకోణంతో కాకుండా మృతుడి కటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు
కన్నాయిగూడెం : మా నాన్న మృతితో మేము రోడ్డున పడ్డామని నాగేశ్వరరావు పెద్ద కూతురు పూజ భోరున విలపించింది. మా నాన్నను బతికించుకునేందుకు, ఆస్పత్రి ఖర్చులకు అన్నీ అమ్ముకొని అప్పులు చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు మాకు ధైర్యం చెపుతూ ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేవారు. ఆయన ఆస్పత్రి ఖర్చులకు రూ. రెండు లక్షల యాభైవేలకు పైనే సాయం అందించారు. ఆయన అందుబాటులో లేకున్నా వారి తమ్ముడు ప్రదీప్‌రావును పంపించగా కుటుంబ సభ్యుల తీరుగా దవాఖానలో దగ్గరుండి అన్నీ చూసుకున్నారని తెలిపింది. వైద్యం కోసం రూ.8 లక్షల వరకు ఖర్చు అయిందని, ప్రభుత్వం స్పందించి వైద్యకోసం చేసిన అప్పులను తీర్చి ఆదుకోవాలని కోరింది.