హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 26: ఈనెల 28 నుంచి 30 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సదస్సు నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. మంగళవారం కేయూ సెనెట్హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ దేశంలోనే కాదు దక్షిణ ఆసియా లోనే వృత్తిపరమైన చరిత్రకారుల అతి పెద్ద సంస్థ అని వెల్లడించారు. భారత ఉపఖండంలో 35వేల మంది చరిత్రకారులు, చరిత్ర బోధకులు సభ్యులుగా ఉన్న సంస్థ నిర్వహిస్తున్న ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 30 ఏండ్ల తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం వేదికవుతుందని తెలిపారు. 1993లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వైస్ చాన్స్‌లర్‌గా, చరిత్ర విభాగ ప్రొఫెసర్ బొబ్బిలి విభాగాధిపతిగా ఉన్నప్పుడు నిర్వహించినట్లు చెప్పారు. మూడు రోజులు మొత్తం ఆరు సెషన్లలో ప్రాచీన భారతదే శం, మధ్య యుగ భారతదేశం, ఆధునిక భారతదేశం, భారతదేశం ఇతర దేశాల చరిత్రతోపాటు ఆర్కియాలజీ, సమకాలీన భారత చరిత్రపై సెషన్లు ఉంటాయని, వీటితోపాటు రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ప్రొఫెసర్ ఎస్సీ మిశ్రా మెమోరియల్ లెక్చర్, సనాతన హ్యూమనిజం అనే అంశంపై, ఒక సింపోజియం ‘రీజన్ అండ్ ఐడియాలజీ ఇన్ ఇండియన్ హిస్టరీ’ అనే అంశంపై జరుగుతాయని, మొత్తం 1,030 పరిశోధన పత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆచార్య సయ్యద్ అలీ నదీం రేజావి మాట్లాడుతూ జవహర్లాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని, చరిత్ర జీవిత సాఫల్య పురసారం, రూ.50వేల నగదు బహుమతి ప్రొఫెసర్ రామచంద్రగుహకు అందజేస్తామని తెలిపారు.
ఉత్తమ పుస్తకానికి ఇచ్చే అవార్డు ప్రొఫెసర్ కేఎం శ్రీమాలికి అవార్డుతోపాటు రూ.50వేల నగదు బహుమతి అందజేస్తామని, వివిధ రకాల చరిత్ర పుస్తకాల్లో మరో ఆరు అవార్డులు అందజేస్తామని, 2022లో చెన్నై మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చివరి సెషన్లో సమర్పించిన 11 మంది యువ పరిశోధకుల పరిశోధన పత్రాలకు అవార్డులు, బహుమతులు ప్రదానం చేస్తామని వివరించారు. 28న వీసీ రమేశ్ అధ్యక్షతన జరిగే ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, న్యూ ఢిల్లీ నెహ్రూ మెమోరియల్ మ్యూజి యం, లైబ్రరీ పూర్వపు సంచాలకుడు డాక్టర్ మ్రిదుల ముఖర్జీ విచ్చేస్తారని, అతిథులుగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ఆదిత్య ముఖర్జీ, కార్యదర్శి ఆచార్య ఎస్ఎఎన్ రేజవి, రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస రావు, 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ ఆచార్య టీ మనోహర్ పాల్గొంటారని, 30న జరిగే ముగింపు సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార విచ్చేస్తారని తెలిపారు. రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్‌రావు, 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ ఆచార్య టి.మనోహర్, విశ్రాంత చరిత్ర విభాగ ఆచార్యులు ఎస్.శ్రీనాథ్ పాల్గొన్నారు.