బయ్యారం, ఆగస్టు 15 : మట్టి మనుషుల దేశభక్తికి మువ్వన్నెల జెండా మురిసిపోయింది. ప్రకృతి ఒడిలో పంట పొలాలు ముచ్చటపడేలా స్వచ్ఛమైన మనసుతో చేసిన ఆత్మీయ వందనానికి జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ‘మాకూ దేశభక్తి ఉంది.. మేమూ జెండా పండుగలో పాల్గొం టాం’ అంటూ మహిళా కూలీలు వారు పనిచేసే వరి పొలంలో జెండాను ఎగరేసి, జాతీయ గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గంగాబజార్కు చెందిన మహిళా కూలీలు వెంకట్రాంపురం శివారులోని ఓ రైతు పొలంలో నాటు వే సేందుకు వెళ్లారు. అక్కడే స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. నారు కట్టలను కుప్పగా పోసి, జెం డా కర్ర ఏర్పాటు చేసి జాతీయ జెండాను కట్టి, ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇది చూసిన పలువురు స్థానికులు దేశభక్తంటే.. ఇది కదా అంటూ వారిని మెచ్చుకున్నారు.