జనగామ, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఇంధన, నిత్యావసరాలపై పడుతున్నది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు రోజురోజుకూ పెరగడం సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను హడలెత్తిస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరాభారం మరింత తీవ్రం కానున్నది. ఇప్పటికే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్‌పై రూ.114 వరకు పెరగడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ భారంగా మారింది.
వంటనూనెల ధరలు కూడా మండిపోతున్నాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ తేదీలను పెంచడంతో వినియోగదారులకు ఇంధన కొరత భయం పట్టుకుంది. సన్‌ప్లవర్, పామాయిల్ వంటి నూనెల ధరలు రోజుకోరకంగా పెరుగుతున్నాయి. గతంలో లీటర్‌కు రూ. 111కు లభించే పామాయిల్ ప్యాకెట్ ధర రూ. 120 నుంచి రూ.125కు చేరింది. లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.170 నుంచి రూ.175కు, 5 లీటర్ల క్యాన్ రూ.780 నుంచి రూ.900కు, 15 లీటర్ల క్యాన్ ధర రూ.2,380 నుంచి రూ.2500, రైస్‌బ్రాన్ ఆయిల్ లీటర్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగింది. వీటితోపాటు పల్లీలు, వెల్లుల్లి ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.
కిలో పల్లీలు రూ.120 నుంచి రూ.165కు, వెల్లుల్లి రూ.170 వరకు చేరుకున్నది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల మార్కెట్లో ధరల పెరుగుదల ఆగడం లేదు. గ్యాస్ ఆధారంగా తయారయ్యే మినీ వాటర్ గ్లాసుల ప్యాకెట్ ధర రూ. 25 నుంచి రూ.35కు, జంబో గ్లాసుల ప్యాకెట్ రూ.35 నుంచి రూ.65కు పెరిగింది.
హ్యాండిల్ కవర్ల ధర కూడా కిలోకు రూ. 120 నుంచి రూ. 170, రూ.200కు, పెద్దసైజు కవర్లు రూ. 220 నుంచి రూ.250కు పెరగడంతో చిన్న వ్యాపారులు, రిటైల్ షాపుల యజమానులు సతమతమవుతున్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో స్పష్టత లేకపోవడంతో రానున్న రోజుల్లో నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు మరింత పెరుగుతాయనే భయం వెంటాడుతున్నది.
కురవి, మార్చి 23: గ్యాస్ కొరతతో హోట ల్, రెస్టారెంట్లకు కట్టెల, ఉనుక పొయ్యి లే దిక్కుగా మారాయి. కమర్షియల్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో హోట ళ్ల యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల వంటలకు అధిక సమయం పడుతుండడమే కాకుండా, ఖర్చులు పెరుగుతున్నాయని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయ ని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో పూర్తిస్థాయిలో వంటలు చేయకుండా సమయానికి ముందుగానే మూసివేస్తున్నామంటున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించాలనుకున్నా అధికారుల తనిఖీల్లో దొరికితే ఇబ్బందుల పాలవుతామని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతింటున్నదని ఆందోళన చెందుతున్నారు.
కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు తిండి కష్టాలు మొదలయ్యాయి. దేవాలయం చుట్టు పక్క పదికిపైగా చిన్న, మరో పది పెద్ద రెస్టారెంట్లు ఉండగా, ఇవన్నీ గ్యాస్‌పై ఆధారపడే వంటలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడుతుండడంతో దర్శనానికి వచ్చిన భక్తులు భోజనం కోసం ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం డొమెస్టిక్, కమర్షియ ల్ సిలిండర్ల సమస్యను పరిష్కరించాలని హోట ల్ యజమానులు, స్థానికులు కోరుతున్నారు. లేకపోతే చిన్న వ్యాపారాలు పూ ర్తిగా మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కొందరు సబ్సిడీ గృహ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి వాటిని కమర్షియల్ సిలిండర్లలో రీఫిల్ చేసి అమ్ముతున్న వైనం కొద్దిరోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. కమర్షియల్ సిలిండర్ సాధారణ ధర రూ.2,100 ఉండగా ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నారు. సబ్సిడీ సిలిండర్లను కూడా కొందరు ఏజెంట్లు, డెలివరీ బాయ్స్ ఒక్కో సిలిండర్ రూ. 1,200 నుంచి రూ.1,500కు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయి, డొమెస్టిక్ సిలిండర్ సరఫరాకు సమయం పడుతుండడంతో చాలా మంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కర్రల ధర కూడా క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.700కు చేరింది. అలాగే గ్యాస్ కొరత భయంతో ఇంట్లో ఉన్న సిలిండర్లకు బదులు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండెక్షన్ స్టవ్‌లు వాడతుండడంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతున్నది.