పాలకుర్తి రూరల్, డిసెంబర్ 17: అక్కా చెల్లల్లకు వ్యవసాయ భూమి పంచి ఇచ్చాడనే కోపంతో తండ్రిని హతమార్చిన తనయుడి ఉదంతం పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో ఆదివారం జరిగింది. ఎస్సై తాళ్ల శ్రీకాంత్, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. సిరిసన్నగూడేనికి చెందిన గాయాల వెంకటయ్య(68)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు. వీరిలో కొంతకాలం క్రితం ఓ కుమార్తె మృతి చెందింది. వెంకటయ్యకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నెలరోజుల క్రితం తనకున్న వ్యవసాయ భూమిలో ఇద్దరు కూతుళ్లకు 20 గుంటల చొప్పున పంచాడు. ఈ విషయం నచ్చని తనయుడు గాయాల నర్సయ్య తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం వారి వ్యవసాయ భూమి వద్ద గొడవపడి రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా విచారణ చేపట్టారు. నిందితుడు నర్సయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. మృతదేహాన్ని జనగామలోని ఏరియా దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై ఎస్సై తాళ్ల శ్రీకాంత్‌ను వివరణ కోరగా తండ్రిని కొడుకు చంపింది వాస్తవమేనని, మృతుడి కూతుళ్లు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు స్వీకరించలేదన్నారు.
వరంగల్, డిసెంబర్ 17 : వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. గ్రీవెన్స్‌ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.