నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 28 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేని వాన కురిసింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 9.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.1, మహబూబాబాద్ జిల్లాలో 3.16 సెంటీ మీట ర్లు, జనగామలో 2.88, హనుమకొండలో 2.62, వరంగల్‌లో 2,53 సెం.మీ. వాన కురిసింది.
దీంతో పలు జలాశయాల్లోకి భీరీ ఎత్తున నీరు చేరుకోగా పలు చెరువులు, కుంటలు మత్తడి పడుతున్నాయి. లోలెవల్ కాజ్‌వేలు, రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడక్కడా చెరువులు, కుంటలు తెగిపోయాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. ములుగు జిల్లాలోని తాడ్వాయి, గోవిందరావుపేటలో భారీ వర్షం కురవడంతో పస్రా-తాడ్వాయి మధ్యలోని మండల తోగు వద్ద 163వ జాతీయ రహదారి కోతకు గురైంది.
తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు మేడారం గ్రామంలోని దుకాణాదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రేగొండ మండలంలో 8.23, గణపురంలో 5.78 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి సమీపంలోని మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తూ డేంజర్ 1 లెవల్‌కు చేరింది. దీంతో దాని పరీవాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి.
గణపురం మండలంలోని అప్పయ్యపల్లి, నగరంపల్లి మధ్య ఉన్న ముసళ్లకుంటకు గండిపడింది. టేకుమట్ల మండలంలోని టేకుమట్ల-అంకుశాపూర్ గ్రామాల మధ్య లోలెవల్ కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో వేసిన మిరపనారు సుమారు ఎకరం మేర కొట్టుకుపోయింది. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవాపూర్, కోనంపేట లోలెవల్ కల్వర్టులపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సుమారు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతుంటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.