హన్మకొండ సబర్బన్, ఆగస్టు 20 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పంట సాగు చేస్తుంటారు. దీనికి పెద్ద మొత్తంలో యూరియాను వాడుతుంటారు. అయితే గత పదేండ్లలో ఎన్నడూ లేని యూరియా కొరత ఇప్పుడు అన్నదాతలను వేధిస్తున్నది. నిత్యం యూరియా బస్తాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఒక పంటకు సరిపడే స్టాక్ నిల్వ ఉండగా, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో రైతులు నిత్యం పీఏసీఎస్‌లు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద కుస్తీ పడుతున్నారు.
యూరియా కోసం రేయింబవళ్లు ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు కలిపి ప్రతిరోజు ఒక వ్యాగన్ యూరియా మాత్రమే వస్తుండగా లారీల్లో ఆయా జిల్లాలకు కేటాయింపుల వారీగా తరలిస్తున్నారు. దీంతో నిత్యం యూరియా రైలు వస్తుందా? అని వరంగల్ లైల్వే స్టేషన్లో వాకబు చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నది. ఒకవేళ వ్యాగన్ వస్తే తమ మండలానికి ఎంత యూరియా వస్తున్నదని రైతులు ఆరా తీస్తుండడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాకు కేటాయించిన యూరియా సరఫరాలో 46 శాతం లోటు ఉన్నట్లు సమాచారం.