సుబేదారి, జూలై 7 : హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పరంగా పేదలకు అందాల్సిన వైద్య సేవ లు కుంటుపడిపోయాయి. కొత్తగా వచ్చిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నెల గడవక ముందే ఉద్యోగుల వివాదంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది ఎవరికి వారే అన్న రీతిగా వ్యవహరించడంతో పనితీరు కుంటుపడింది.
జిల్లా స్థాయి వైద్యాధికారుల (పోగ్రామ్ ఆఫీసర్లు) నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మందుకుసాగక ప్రజలకు వైద్య సేవలందడం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, అంటు వ్యాధుల నియంత్రణ, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, కుష్టు, ఎయిడ్స్ తదితర వ్యాధుల నివారణ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన ప్రోగ్రామ్ అధికారులకు కుర్చీలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్య కార్యక్రమాల్లో వెనుకబాటు
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అమలయ్యే పలు ఆరోగ్య కార్యక్రమాల్లో హనుమకొండ జిల్లా వెనుకబాటులో ఉంది. ప్రధానంంగా మాతా శిశు సంరక్షణ, చైల్డ్ హెల్త్, బీపీ, షుగర్, క్యాన్సర్, వానకాలంలో దొమలు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, చికున్ గున్యా, బోదకాలు తదితర వ్యాధుల నియంత్రణ సరిగా జరగడం లేదు. జిల్లాలోని 14 మండలాల్లో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నగరంలో ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా వ్యాప్తంగా 106 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా, వాటిలో కొన్నింటికి ఇన్చార్జి అధికారులే ఉన్నారు. పీహెచ్సీలో పనిచేసే స్టాఫ్ నర్స్‌లు, ఫారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది డ్యూటీకి సరిగా రాకపోవడంతో ప్రజలకు సరైన వైద్య సేవలందడం లేదనే విమర్శలున్నాయి. మొత్తంగా ఇన్చార్జిల పాలనలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పూర్తిగా గాడి తప్పింది.
ఇంచార్జీలదే పాలన..
హనుమకొండ డీఎంహెచ్‌వోగా రామ్‌కుమార్ జూన్ 6న భాద్యతలు తీసుకున్నారు. నెల గడవక ముందే ఉద్యోగులతో వివాదం మొదలుకావడంతో ఆయన కింద పనిచేయలేమని వైద్యాధికారులు, సిబ్బంది ఇటీవల మూకుమ్మడిగా కలెక్టర్‌కు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గట్టిగా పనిచేయమన్నందుకు తనపై తప్పుడు ప్రచారం చేసి జిల్లా నుంచి పంపించడానికి కొందరు యూనియన్ నాయకులు, వైద్యాధికారులు కుట్ర పన్నారని డీఎంహెచ్‌వో బాహాటంగానే చెప్పడం, సెలవులో వెళ్లడం చర్చనీయాంశమైంది.
కొందరు వైద్యాధికారులు ప్రోగ్రామ్ ఆఫీసర్లు, పీహెచ్సీలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది కూడా డ్యూటీలకు సరిగా రావడం లేదనే ఆరోపణలున్నాయి. ఇదే విషయం రామ్‌కుమార్ తనిఖీల్లో కూడా వెల్లడైంది. ఉద్యోగుల వైరం కారణంగా ఆయన సెలవులో వెళ్లడంతో అడిషనల్ డీఎంహెచ్‌వో మదన్మోహన్రావు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే జాతీయ హెల్త్ మిషన్ కింద అమలవుతున్న మాతా శిశు సంరక్షణ, అంటు వ్యాధులు కానీ బీపీ, షుగర్, క్యాన్సర్ నియంత్రణ, టీబీ, దోమలు, కీటక జనిత వ్యాధుల నియంత్రణ, వ్యాధి నిరోధక టీకాలు వంటి కార్యక్రమాలకు ఇన్‌చార్జిలే ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా ఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు అమలు కావడం లేదు.