బచ్చన్నపేట సెప్టెంబర్ 18 : సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని ఇంచార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భౌతిక నిల్వలతో పాటు స్టాక్ రిజిస్టర్, రైతు వారి సేల్ రిజిస్టర్ను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా యూరియా పంపిణీ చేయాలన్నారు.
ఇప్పటివరకు బచ్చన్నపేట మండలంలోని తొమ్మిది కేంద్రాల ద్వారా, సబ్ సెంటర్ల ద్వారా రైతులందరికీ యూరియా సరఫరా చేస్తామన్నారు. బచ్చన్నపేట మండలానికి ఇప్పటివరకు వివిధ డీలర్ల ద్వారా 848 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా జరిగిందన్నారు. సెప్టెంబర్ మాసానికి గాను బచ్చన్నపేట మండలానికి 270 మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను ఇప్పటివరకు 198 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు అయ్యిందన్నారు.
అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ , ఇందిరమ్మ ఇళ్ల గురించి సంబంధిత అధికారులతో సమీక్షించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీవో నాగపూరి స్వరూపరాణి, ఎంపీడీవో మమతా బాయి, ఎంపీఓ మల్లికార్జున్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.