జనగామ నియోజకవర్గంలో నిలిచిపోయిన దేవాదుల పనులను వెంటనే పూర్తి చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దేవాదుల ప్రాజెక్టు కెనాల్ పనులు నిలిచిపోయాయని, నిధులు కేటాయించి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దేవన్నపేట పంప్‌హౌస్ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో పల్లా మాట్లాడారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం వరకు నీరు తరలించే 4 మోటార్ల గురించి వివరించారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి వద్ద ఆగిపోయిన కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. తపాస్‌పల్లికి మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చే పనులు 25శాతం పూర్తయ్యాయని ఇవి పూర్తయితే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్‌పల్లికి సులువుగా నీరు చేరుతుందని, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ప్రాంతాలకు ఎకువ నీరు వస్తుందని చెప్పారు.
భూసేకరణ పరిహారం కొందరికే ఇవ్వడం వల్ల బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో కెనాల్ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయని వెంటనే నిధులు కేటాయించి పనులు పునః ప్రా రంభించాలని కోరారు. ఆర్ఎస్ ఘన్పూర్ నుంచి అశ్వరావుపల్లి మీ దుగా చీటకోడూరు వరకు 12 కిలోమీటర్లు గ్రావిటీతో నీరు తీసుకురావడం జరుగుతున్నదని, చీటకోడూరు డ్యామ్‌లో నిల్వ చేసి, అకడినుంచి జనగామ పట్టణానికి తాగునీరు సరఫరా చేస్తారని డ్యామ్‌లో నీరు నింపి జనగామ పట్టణానికి నిరంతర తాగునీరందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరిగొప్పుల, చిలుపూర్, వేలేరు మండలాలకు సంబంధించిన లిఫ్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
గత ప్రభుత్వంలో మూడు లిఫ్ట్‌లకు సంబంధించి రూ.104 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఒక లిఫ్ట్ ద్వారా తరిగొప్పుల మం డలంలోని 15 గ్రామాలకు నీరందించే పనులను పరిశీలించాలని మంత్రిని కోరారు. వానకాలంలో ఈ ప్రాంతంలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేవాదుల పంపింగ్ మెయింటెనెన్సు డబ్బులు ఆలస్యంగా ఇవ్వడం వల్ల గత సీజన్లో 34 రోజులు మోటార్లు ఆపివేయడం దురదృష్టకరమని, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా మెయింటెనెన్స్ పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియను గ్రీన్‌ఛానెల్‌లో పెట్టి వేగంగా పూర్తి చేయాలని కోరారు.