మామునూరు ఎయిర్పోర్ట్ ప్రకటనతో దాని పరిసర ప్రాంతాల్లోని భూములకు అమాంతం ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న రియల్ఎస్టేట్ మాఫియా ఎయిర్ పోర్టు సమీపంలోని వ్యవసాయ భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లుగా మార్చి దర్జాగా విక్రయిస్తున్నది. ఎయిర్ పోర్టును ఎరగా చూపి అమాయక ప్రజల ను మోసం చేస్తున్నది. అధికారుల కండ్లెదుటే ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– ఐనవోలు, జూన్ 1
ఇన్ని రోజులు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ మాఫియా ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తున్నది. వ్యవసాయ భూములు, పచ్చని పంట పొలాలను టార్గెట్‌గా చేసుకొని అక్రమార్జనకు తెగబడింది. ఏటా రెండు పంటలు పండే భూ ములు సైతం రియల్ పడగలో భస్మమవుతున్నాయి. రియల్ ఎస్టే ట్ వ్యాపారులతోపాటు ఖద్దరు దుస్తులు ధరించిన కొందరు పలుకుబడి ఉన్న రాజకీయ నేతలు మామునూరు ఎయిర్‌పోర్టును ఎర గా చూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
రైతుల దగ్గ ర వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, నాలా కన్వర్షన్, లే అవుట్ అనుమతుల వంటివి లేకుండానే దర్జాగా విక్రయిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఐనవోలు, పున్నేల్, వెంకటాపురం, గర్మిళ్లపల్లి, కొండపర్తి, సింగారం, ముల్కలగూడెం, నర్సింహులగూడెం గ్రామాల్లో వ్యవసాయ భూములు, పంట పొలాలపై రియ ల్ మాఫియా కన్నేసి కాజేస్తున్నది. మామునూర్ ఎయిర్‌పోర్టు పరిధిలోని భూములని నమ్మించి, యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నది.
ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని పంట పొలాల్లో సబ్‌స్టేషన్ వెనుక నుంచి చింతకుంటకు వెళ్లే మడికట్టును ఆనుకొ ని సర్వే నంబర్ 127, 126 వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మా ర్చి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సర్వే నంబర్లలోని భూమిలో అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నది. ఇవేమీ పట్టించుకోని రియల్ మాఫియాలో ఆ భూమిని ప్లాట్లుగా మార్చి, అంగట్లో పెట్టి గజానికి వేలాది రూపాయల చొ ప్పున అమ్ముతూ జేబులు నింపుకుంటున్నది.
ఇలాంటి అనుమతి లేని అక్రమ వెంచర్లలో భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఇబ్బందులు తప్పవు. ఇదే గ్రా మంలో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయ ని అడ్డుకున్న అధికార యంత్రాంగం.., అక్రమ వెంచర్లు వెలుస్తుం టే మాత్రం పట్టించుకోవడం లేదంటే అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిబంధనలను నుంచి తప్పించుకునేందుకు రియల్ వ్యాపారులు ప్లాట్లను గజాల్లో కాకుండా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తూ ప్రభుత్వానికి ఫీజు ఎగ్గొడుతూ.., కొనుగోలుదారులను సైతం మోసం చేస్తున్న మాఫీయాకే అధికారులు వంతపాడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మామునూరులో ఎయిర్‌పోర్టు నిర్మా ణం తప్పనిసరిగా జరుగుతుందని అందరికీ తెలుసు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థా నిక రైతులు కూడా సుముఖంగా ఉన్నారు. అందుకోసం అవసరమైన భూమి ప్రభు త్వం తీసుకుంటుందని ఇక్కడి ప్రజలు సై తం నిర్ణయించుకున్నారు. కానీ, స్పష్టమైన హామీ కోసం రైతులు, ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు వీలున్నపుడు పిలుస్తూ కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు రాగానే మా ఘనతే అంటూ సంబురాలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పనుల వేగానికి, రైతులకు ఇచ్చే పరిహారంలోనూ చొరవ చూపితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భూ సేకరణకే ఇంత సమయం పడితే ఇక నిర్మాణం ఇంకెంతకాలం పడుతుందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరీమాబాద్, జూన్ 1 : ఎయిర్‌పోర్టు నిర్మాణం జిల్లా ప్రజల దశాబ్దాల కల. మా మునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రభుత్వం, అధికారులు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులపై అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సేకరణ చేపట్టి తమకు అప్పగిస్తే, మూడేండ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి ప లు సందర్భాల్లో తెలిపారు. కేంద్ర ప్రభు త్వ అనుమతి వచ్చి 3 నెలలు గడిచినా భూసేకరణ ప్రక్రియ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది.
తమకు న్యాయం చేయాలని రైతులు, పలు గ్రా మాల ప్రజలు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఎవరి భూమి ఎంత పోతుతున్నదనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని తెలుస్తున్నది. భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఎంత ఇస్తా రు..?, ఎలా ఇస్తారు అనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన వారం పది రోజులు హడావుడి చేసిన అధికారు లు.. ఇప్పుడెవరూ కానరావడంలేదని రైతులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చి మూడు నెలలు గడుస్తున్నా భూ సేకరణ అంశం కొలిక్కి రాలేదని తెలుస్తున్నది. ప్ర స్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆధీనంలో సుమారుగా 696 ఎకరాలు ఉన్నట్లు తెలిసింది. దాదాపు మరో 253 ఎకరాల స్థ లం కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేపట్టారు. 1930లో నిర్మించిన మామునూరు విమానాశ్రయం 1981 వరకు సే వలను అందించినట్లు పలువురు పేర్కొంటున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ప్రజల ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనున్నది. వ్యాపార, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. అధికారులు పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యవసాయ భూములను ఎలాంటి అనుమతి లేకుండా వ్యవసాయేతర భూములుగా సులువు గా మార్చేస్తున్నారు. అధికారుల కండ్ల ఎదుటే ఈ తతంగం జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవ డం లేదంటే.., దందాలో వీరి ప్రమేయం కూడా ఉండొచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా రియల్ మాఫీయా వ్యవసాయ భూమిని కాగితంపై వెంచర్ చేసి, గుంటల లెక్కన రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, ఆ గుంట భూమికి ఇటు రైతుబంధు, అటు రైతుబీమా వస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ మాఫియా తమ పని తాము చేసుకుంటూ పోతుంటే అధికారులు మాత్రం కిమ్మనకుండా తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తు వీడి, పచ్చని వాతావరణంలో ఉండే ఐనవోలు మండలాన్ని రియల్ ఎస్టేట్ మాఫీయా చేతుల్లో నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.