నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 22 : యూరియా కోసం అన్నదాతలు రాత్రింబవళ్లు తిప్పలు పడుతుంటే బస్తాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాలు ట్రాక్టర్లో అక్రమంగా తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. పరకాల మండలంలోని నాగారం క్లస్టర్ పరిధిలోని ఏఈవో చేతివాటం ప్రదర్శించి తన బంధువులకు సరఫరా చేస్తుండగా ఓ రైతు వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నాడు.
అదేవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నుంచీ క్యూలు, తోపులాటలు కొనసాగుతున్నాయి. నెక్కొండ మండలం నాగారంలో అక్రమంగా యూరియా బస్తాలు తరలిస్తుండగా రైతులు అడ్డుకుని వ్యవసాయాధికారిపై మండిపడ్డారు. నెక్కొండలో అన్నదాత లు ధర్నా చేయగా, రాజుపల్లిలో క్యూలో నిల్చున్న మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది.
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇక్క ట్లు పడుతుంటే వ్యవసాయ అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పరకాల మండలంలోని నాగారం గ్రామ క్లస్టర్ ఏఈవో కాటం రాజు కమలాపురం మండ లం శనిగారం గ్రామానికి చెందిన తన బం ధువులకు యూరియా టోకెన్లు అందించాడు. కాగా సదరు వ్యక్తి వాహనంలో 8 బస్తాల యూరియాను తరలిస్తుండగా నాగా రం గ్రామానికి చెందిన రైతు వెంబడించి అడ్డుకున్నాడు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని వెంటనే ఏఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కాగా, ఈ ఘటనపై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ను వివరణ కోరగా నడికూడ మండలం వద్ద రైతులు వాహనాన్ని అడ్డుకున్నది వాస్తవమేనని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా మహదేవపూర్‌లోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి 20 బస్తాల యూరియాను ట్రాక్టర్ ద్వారా అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. స్టాప్ సేల్ ఆర్డర్‌తో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేసి లైసెన్స్ సస్పెన్షన్ చేస్తున్నట్లు ఏవో సుప్రజ్యోతి వెల్లడించారు. గణపురం మండల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు అర్ధరాత్రి క్యూలో నిలబడిన దృశ్యం గుండెలను కలిచివేసింది. మల్లంపల్లి మండలంలోని రామ చంద్రాపురం జీపీ వద్ద రైతులు క్యూలో నిలబడలేక చెప్పులు, ఖాళీ మద్యం సీసాలు పెట్టారు.
తాడ్వాయి మండలంలోని కాల్వపల్లిలో యూరియా కోసం జరిగిన తోపులాటలో ఓ వృద్ధురాలు కిందపడడంతో గాయాలయ్యాయి. నర్సంపేట మండలంలోని రాజపల్లి సొసైటీ గోదాము కు ముగ్ధుంపురం గ్రామాని కి చెందిన మహిళా రైతు హన్మకొండ అనూష తెల్లవారుజామున వచ్చి క్యూలో నిల్చుంది. గంటలతరబడి నిలబడడంతో సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నర్సంపేట పట్టణంలోని మల్లంపల్లిరోడ్డులోని ఓ ప్రైవేటు డీలర్ యూరియా బస్తాకు నానో యూరియాను లింకుపెట్టి ఇస్తుండడంతో పలు గ్రామాల రైతులు మండిపడ్డా రు.
ఎరువుల షాపు ఎదుట ధర్నా చేశారు. నెక్కొండలో యూరియా బస్తాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ మడిపెల్లి గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామానికి ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పడం లేదని, వ్యవసాయాధికారి వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించేది లేదంటూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగని సూరయ్య వారికి బాసటగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకొని ఏవోను పిలిపించి న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.