ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఎంఎల్ఎస్ పాయింట్స్‌ను అడ్డాగా చేసుకొని కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ డీలర్లకు నెలనెలా ఇచ్చే పీడీఎస్ బియ్యం నుంచి క్వింటాల్‌కు సుమారు 3 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. తూకం వేయకుండానే లారీ టు లారీ అన్లోడ్ విధానంలో భాగంగా నేరుగా రేషన్ దుకాణాలకు సరుకులు పంపుతున్నారు.
50 కిలోల బస్తాలో 43 కిలోల నుంచి 43.50 కిలోల బియ్యం మాత్రమే ఉంటుండగా ఒక్క బస్తాలో 6.50 కిలోల నుంచి 7 కిలోల తక్కువ వస్తున్నది. జనగామ జిల్లాలోని చౌకధరల దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యంలో ఇలా మోసాలు జరుగుతున్నా సంబంధిత శాఖ తనిఖీలు చేయకపోవడం, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం అనుమానాలకు తావిస్తున్నది. అయితే కొందరు జిల్లా స్థాయి అధికారుల అండతోనే ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతున్నదని ప్రతి నెలా స్టాక్ పాయింట్ ఇన్చార్జిల మాయాజాలంతో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
-జనగామ, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తున్నది. రూపాయికి కిలో బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతున్నది. దీంతో జనగామ ప్రాంతంలో బియ్యం అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంటే స్టాక్ పాయింట్ అధికారులు, సిబ్బంది, డీలర్లు, అక్రమార్కులకు వరంగా మారుతున్నది. నిఘా పెట్టాల్సిన సంబంధిత అధికారులకు సైతం దందాలో వాటా వెళ్తుండడంతో అన్నిస్థాయిల్లో తనిఖీలు మరచిపోవడంతో ప్రతి నెలా వందల క్వింటాళ్లు పక్కదారి పడుతున్నది.
జనగామ జిల్లాలో స్టాక్ పాయింట్లు బియ్యం దందాకు కేరాఫ్‌గా నిలుస్తుంటే రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో భారీ మోసం చోటుచేసుకుంటున్నది. జిల్లాలోని జనగామ(చంపక్‌హిల్స్), స్టేషన్‌ఘన్‌పూర్, కోలుకొండ (దేవరుప్పుల) స్టాక్‌పాయింట్ గోదాంల నుంచే బియ్యాన్ని నేరుగా డీలర్లకు చేరవేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని అనేక చోట్ల అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడుతున్నది. ఇతర జిల్లాల్లో దొరుకుతున్న బియ్యం కూడా జనగామ నుంచే వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా తనిఖీలు చేయాల్సిన అధికారులు స్టాక్ పాయింట్ల వైపు కూడా చూడడం లేదనే ఆరోపణలున్నాయి. తూకంలో మోసం జరిగినా డీలర్లకు మాత్రం సరఫరా చేయాల్సిన మొత్తం బియ్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గోదాం నుంచి స్టాక్ పాయింట్లకు వచ్చిన సంచుల్లోనే 6 నుంచి 7 కిలోల బియ్యం తక్కువ(తరుగు) వస్తుందని స్వయంగా డీలర్లే గగ్గోలు పెడుతున్నారు.
డీలర్లు డీడీలు చెల్లించిన తర్వాత ప్రతినెలా 15 నుంచి 17వ తేదీ లోపు రేషన్ షాపులకు బియ్యం సరఫరా పూర్తి చేయాల్సి ఉండగా.. స్టాక్ లేదనే నెపంతో ఒక్కోసారి 19 నుంచి 25వరకు కూడా సరఫరా కావడం లేదు. అధికారులు మాత్రం తెలివిగా నిర్ణీత గడువులోపే గోదాం ఈ-పాస్ మిషన్ పోర్టబుల్లో డీలర్ల వేలిముద్ర వేయించుకొ ని ఆన్లైన్లో బియ్యం సరఫరా చేసినట్లు చూపిస్తున్నా రు. ప్రతి బస్తాకు 5.50 గ్రాముల గన్నీ బరువు మినహాయించి, రవాణాలో తరుగు కింద అదనపు బియ్యాన్ని డీలర్ల సమక్షంలోనే తూకం(కాంటా) వేసి లారీలో లోడ్ చేయాలి.
కానీ జిల్లాలోని గోదాంల్లో ఎలాంటి గన్నీ మినహాయింపు, బియ్యం తూకం లేకుండానే బస్తాల సంఖ్య ప్రమాణికంగా డీలర్ లేకుండానే హమాలీలే లోడ్ చేసుకొని లారీల్లో తెచ్చి రేషన్ షాపుల్లో అన్లోడ్ చేసి వెళ్తున్నారు. వాస్తవానికి 50కిలోల బియ్యానికి అదనంగా 5.50 గ్రాముల బస్తాబరువు కలిపి తూకం వేయాల్సి ఉండగా కొన్నిసార్లు 43కిలోలు.. మరికొన్నిసార్లు 48 నుంచి 49కిలోలు మాత్రమే తూకం ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. బియ్యం లారీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మార్గమధ్యలో హమాలీలు బస్తాల నుం చి కొండితో లాగి 1కిలో నుంచి 2కిలోల వరకు బియ్యం తీసుకుంటున్నారని చెబుతున్నారు.
ఒకవేళ గోదాముల్లో తూకం వేసినా అధికారులు, సిబ్బంది చేతివాటంతో ఎక్కువ తూకం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనుమానం వచ్చిన నర్మెట మండలంలోని ఓ డీలర్ గోదాం నుంచి వచ్చిన బియ్యా న్ని బయట వేబ్రిడ్జి కాంటా వేయించుకుంటే ఆయన కోటాకు వచ్చే బియ్యం కంటే 7క్వింటాళ్లు తక్కువ రావడంతో గోదాం సిబ్బందితో పెద్ద గొడవే జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం సైతం సంబంధిత ఇన్చార్జితో కుమ్మక్కై హమాలీలు కిలో రూ.50 చొప్పున కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే చంపక్‌హిల్స్ స్టాక్ పాయింట్ గోదాం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌రెడ్డి ఎనిమిదేళ్లుగా ఒకేచోట తిష్ఠవేశారు. బియ్యం అక్రమాల వ్యవహారంలో తనిఖీ సందర్భంగా గతంలో ఒకసారి దొరికిపోయి సస్పెండ్ కూడా అయ్యా డు. తిరిగి స్టేషన్‌ఘన్‌పూర్‌కు పోస్టింగ్ వేయించుకొని కొద్దినెలలకే తిరిగి జనగామ పాత అడ్డాకు బదిలీ చేయించుకున్నాడు. తాజాగా పౌర సరఫరాల శాఖలో జరిగిన బదిలీల్లో సదరు గోదాం ఇన్చార్జికి పదోన్నతి లభించినా ఏదో నెపంతో అడుగు కదపడం లేదని తెలుస్తున్నది. బియ్యం సరఫరా చేసే లారీల యజమాని సైతం పదేళ్లుగా ఒక్కరే వ్యవహరిస్తుండడంతో ఇన్చార్జి హనుమకొండలో మకాం వేసినా ఆయన కనుసన్నల్లో హమాలీలు, లారీల కాంట్రాక్టర్ ఆధిపత్యంతో చంపక్‌హిల్స్ గోదాం నుంచి డీలర్లకు బియ్యం సరఫరా అవుతున్నది.
స్టేజ్-1, స్టేజ్-2 స్టాక్ పాయింట్లలోనే దందా సాగుతోంది. 50 కేజీల బస్తాలో 43కేజీల తూకం మాత్రమే ఉంటుండగా కోత పెట్టిన బియ్యాన్నంతా స్టాక్ పాయింట్ ఇన్చార్జీ అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వివిధ సందర్భాల్లో పెద్దఎత్తున పట్టుబడిన బియ్యం, నూకలు, పరం వంటి నిల్వలను పంచనామా చేసి తర్వాత జిల్లాకేంద్రానికి అనుసంధానంగా ఉన్న చంపక్‌హిల్స్ ఎంఎల్ఎస్ పాయింట్(స్టాక్ పాయింట్)కు అప్పగిస్తారు. జరిమానా చెల్లించో లేదా కోర్టు ఆదేశాలతోనో తమ నిల్వలను తిరిగి తీసుకునేందుకు వస్తే గోదాంలోనే సగం స్టాక్ మాయం అవుతున్నదని వ్యాపారులు, దళారులు వాపోతున్నారు. ఎక్కడ బి య్యం పట్టుబడినా.. అధికారులు లోతుగా విచారణ జరపకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నది.
ఎఫ్‌సీఐ గోదాం నుంచి స్టాక్ పాయింట్లకు వస్తున్న రేషన్ బియ్యం స్టేజ్-1, స్టేజ్-2 స్టాక్ పాయింట్ల నుంచి జిల్లాలోని రేషన్ షాపులకు లారీల ద్వారా సరఫరా అవుతున్నది. రేషన్ బియ్యం సరఫరాలో పౌర సరఫరాల అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల డీలర్లు పెద్దఎత్తున నష్టపోతున్నారు. స్టాక్ పాయింట్లో డీలర్లకు ఎలాంటి తూకం లేకుండానే గుడ్డిగా లోడ్ చేసి పంపుతుండగా.. డీలర్‌కు చేరే సరికే మార్గమధ్యలోనే బస్తాల్లోంచి కిలోల కొద్దీ బియ్యం మాయం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నా యి. గతంలో కొంతమంది రేషన్ డీలర్లు లారీలను వె యింగ్ మిషన్‌లో తూకం వేయిస్తే బియ్యం తక్కువ వచ్చి న అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని డీలర్లు చెబుతున్నారు. మండల స్థాయిలోని స్టాక్ పాయింట్ల వద్ద అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.