టేకుమట్ల, జూలై 14 : కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని, దోపిడీదారులకు పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, చిట్యాల మండలాల్లోని చలివాగు, మానేరు వాగుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు ఇసుకను ఇష్టారీతిన తరలిస్తున్నారని ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న జిల్లా, మండల అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ టేకుమట్ల మండలాధ్యక్షుడు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అక్రమార్జనే ధ్యేయంగా వాగుల్లో జేసీబీలు పెట్టి ఇసుకను లూటీ చేస్తుంటే నిలువరించాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరించడం దారుణమన్నారు. రోడ్డుపై దిగబడిన వడ్ల లారీని లాగిన జేసీబీసీ స్టేషన్కు తరలించి బీఆర్ఎస్ నాయకుడిపై కేసు పెట్టారని మండిపడ్డారు.
అదే ఓ కాంగ్రెస్ నాయకుడు అర్థరాత్రి మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తుంటే కూలీలు అడ్డుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్లి జేసీబీని బయటకు పంపించారే తప్ప స్వాధీనం చేసుకోలేదని, అలాగే సదరు నాయకుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. గత కేసీఆర్ పాలనలో రైతులకు పెట్టుబడి సాయం, నాణ్యమైన కరెంట్, సరిపడా నీళ్లు, ఎరువులు అందడంతో రెండు పంటలు పండేవన్నా రు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు, నీటి వెతలు, ఎరువుల కొరతతో రైతుల గుండెలు మండుతున్నాయన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రకృ తి కూడా సహకరించడం లేదని, సరైన వానలు కురవక, చెరువులు నిండక నీటి కోసం రైతులు అలమటిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రపంచం అబ్బురపడేలా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పిల్లర్ కుంగితే మరమ్మతు చేయకుండా నీరంతా వృథాగా సముద్రంలో కలిసేలా సీఎం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాళేశ్వరం మోటర్లను ఆన్ చేసి చెరువులు నింపాలని, ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని గండ్ర డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకునూరి తిరుపతి, బందెల నరేశ్, పింగిళి వెంకటేశ్వర్, ఆది రఘు, సదాకర్, ఐలయ్య, ఉద్దమారి మహేశ్, శ్రీనివాస్, దొడ్ల కోటి, తదితరులు పాల్గొన్నారు.