నర్సింహులపేట, జూలై 13 : అధికార బలంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస రుసుం చెల్లించకుండా అభివృద్ధి పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమని, ఇక్కడ నుంచి పొండి అంటూ మండలస్థాయి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి బెదిరిస్తున్నారు. దీంతో కొంత మంది అధికారులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లి పోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కొంత మంది నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారి ట్రాక్టర్లకు ఇసుక అనుమతులు ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేస్తుంటే అడ్డుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారని, పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. శాఖల మధ్య సమన్యయ లోపం ఇసుక మాఫియాకు వరంగా మారింది.
నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు ని ర్మాణం కోసం పంచాయతీరాజ్ అధికారుల ఎస్టిమేట్ ప్రకారం 28 నుంచి 30 ట్రిప్పుల ఇసుక మాత్రమే అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులను తప్పుదోవ పట్టించి అధికార బలంతో ఒక పార్టీకి చెందిన ట్రాక్టర్ల నంబర్లు రాసి ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ రాసిన వారి ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవా ణా చేయాలని, మరో పార్టీ వారి ట్రాక్టర్లు వస్తే సీజ్ చేయాలని అధికారులపై ఒత్తి డి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఒక ట్రాక్టర్‌కు ఐదు ట్రిప్పుల చొప్పున అనుమతులు ఇవ్వడం వెనుక అసలు సూత్ర ధారి ఎవరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ట్రాక్టరు నుంచి అధికారులకు ఇంత ముట్టజెప్పాలని వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చెల్లించకుండా నొక్కేస్తున్నారని, ఇంత భారీ స్థాయిలో ఇసుక తరలిస్తుంటే అ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఈ దోపిడీలో అధికారులు, ప్ర జా ప్రతినిధుల వాటా ఎంత? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇసుక రవాణా వెనుక పెద్ద స్కెచ్చే నడుస్తోంది. అధికారులు రికార్డుల్లో మాత్రం సుదూర ప్రాంతంలో ఉన్న గోదావరి ఇసుక కొనుగోలు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు రికార్డు అవుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఆకేరువాగులో ఉన్న ఇసుక అభివృద్ధి పేరుతో అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా తోడేస్తున్నారు. గోదావరి ఇసుక తెస్తే అయ్యే రవాణా ఖర్చులను మిగుల్చుకుంటూ స్థానిక వనరులను కొల్లగొడుతూ రూ. కోట్లు వెనుకేసుకుంటున్నారు. ఈ దందాతో ఆకేరువాగు ఉనికి ప్రమాదంలో పడడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక 30 ట్రిప్పులకు బదులు 300 ట్రిప్పులకు అనుమతులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఇసుక అనుమతులు రద్దు చేసినట్లు తహసీల్దార్ రమేశ్‌బాబు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.