నెల్లికుదురు, జూన్ 15 : అధికారుల అధికారిక అనుమతులతో పంట పొలాలకు మాత్రమే వినియోగించాల్సిన చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మండలంలోని మదనతుర్తి పెద్ద చెరువు నుండి జెసిబి టిప్పర్ల వాహనాల సహాయంతో చెరువు మట్టిని ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తరలిస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ , రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాచారం తెలిసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
మండలంలోని మదనతర్తి చెరువు నుండి ఆ గ్రామ బస్టేజీ సమీపంలో జరుగుతున్న ఓ నూతన నిర్మాణ పనులకు, అదేవిధంగా పార్వతమ్మ గూడెం చెరువు నుండి ఆ గ్రామంలోని ఫంక్షన్ హాల్ సమీపంలో జరుగుతున్న ఓ నిర్మాణ పనులకు ఆదివారం చెరువు మట్టిని అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించారు. చెరువు మట్టి తరలింపు జోరుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక మండలంలోని రామన్నగూడెం చెరువు నుండి రెండు ఇటుక బట్టీలకు వందలాది ట్రాక్టర్ల మట్టిని తరలించి డంపు చేసిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసింది లేదు… చర్యలు చేపట్టింది లేదు. ఇంత అక్రమం జరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంలో అసలు రహస్యం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.