Hanmakonda | భీమదేవరపల్లి, జులై 11: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల ప్రోద్బలంతో యదేచ్చగా ఈ తంతు కొనసాగుతుంది. ఒక చోట విధులు నిర్వర్తించాల్సి ఉండగా డిప్యూటేషన్ పేరుతో మరోచోట విధులు నిర్వహిస్తున్నారు. వేతనం మాత్రం పనిచేయని చోటు నుండి తీసుకుంటున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు మెజర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో ఒకటి జేబీసీ, రెండు బిల్ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి. బిల్ కలెక్టర్ లు ఒకరు సునీల్, మరొకరు నవీన్ విధులు నిర్వహించేవారు. అయితే డిప్యూటేషన్ పేరుతో సునీల్ ఏడాది క్రితం కమలాపూర్ వెళ్ళగా రెండు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. నవీన్ ఇదే డిప్యూటేషన్ పేరుతో ధర్మసాగర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న షాబాద్ మూడేళ్ల క్రితం డిప్యూటేషన్ పై కమలాపూర్ వెళ్ళాడు. ఇక్కడికి తిరిగి రావాలని చెప్పిన అతను రావడంలేదని అధికారులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. ముల్కనూరులో విధులు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడ్డాడని, అతని లొసుగులు బయట పడతాయనే భయంతోనే ఇక్కడికి రావడం లేదని అధికారులు ముచ్చటించుకుంటున్నారు. దీంతో ముల్కనూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బిల్ కలెక్టర్లు లేకపోవడంతో, గ్రామంలో ఇంటి పన్ను, నల్ల పన్ను వసూలు చేసేవారు కరువయ్యారు.
ఇదిలా ఉండగా వంగర గ్రామపంచాయితీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేతమ్మ ను డిప్యూటేషన్ పై ఈ నెల ఒకటవ తేదీన ముల్కనూరు కు బదిలీ చేశారు. వంగర గ్రామంలో బిల్ కలెక్టర్ పోస్ట్ ను భర్తీ చేయకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామంలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న రాజయ్యను ముల్కనూర్ కు డిప్యూటేషన్ పై వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినా, తాను అక్కడికి వెళ్లకుండా పావులు కదిపినట్లు తెలిసింది. చివరకు నేటి రోజున ముల్కనూరులో ఆయన జాయిన్ అయ్యాడు. ఏది ఏమైనా అక్రమ డిప్యూటేషన్ రద్దుచేసి గ్రామ పంచాయతీలో పాలన సజావుగా జరిగేలా చూడాలని మండల ప్రజలు జిల్లా కలెక్టర్ ను ముక్తకంఠంతో కోరుతున్నారు.