అడుగడుగునా నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలపై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి ఘటన, మాజీ మంత్రి హరీశ్‌రావు అక్రమ అరెస్టు నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్లకుండా గురువారం అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాయకులు, శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేయగా వారు ఠాణాల్లో నిరసన తెలిపారు. ఇటు సర్కారు.. పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు.. ‘సీఎం రేవంత్ డౌన్ డౌన్’.. ‘కాంగ్రెస్ గూండా రాజకీయం నశించాలి’..
‘నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో పోరాటాన్ని అడ్డుకోలేరంటూ అంతటా నినాదాలతో హోరెత్తించారు. అలాగే హరీశ్‌రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. హనుమకొండలో పార్టీ కార్యాలయ గేట్లను సైతం మూసేసి జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు ఐదు గంటల పాటు నిర్బంధించారు. అలాగే ములుగులో జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని హౌస్ అరెస్ట్ చేయగా ఇంట్లోనే బైఠాయించిన నిరసన తెలిపారు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 13