నల్లబెల్లి, మే 14 : కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్టియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామంలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్టియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ జిల్లా కోశాధికారి గొర్రె ప్రదీప్ ల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఆరోపించారు. పాలకులకు కార్మికుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే మిన్నగా ఉన్నాయన్నారు. ఎనిమిది గంటల పని దినాల స్థానంలో 12 గంటలు పని చేయాలని నిబంధనలను తీసుకురావడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బోడికే సుమన్, రాజేష్, పెరుమాండ్ల నరేష్, శ్రీరాముల రవి, చిన్నమల్ల సంపత్, హనుమంతు, రాజు, రాజేందర్, రాంబాబు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.