పోడు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు ప్రతాలిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 53 వేల మందికి 1,47,702 ఎకరాలకు పట్టాలిచ్చింది. సాగునీటి వసతి కోసం ఐటీడీఏ ద్వారా గిరి వికాసం పథకాన్ని అమలు చేసింది. తీరా ఈ పథకం కింద బోర్లు వేసుకొని పంట సాగు చేసుకుందామనుకుంటే అటవీ శాఖ అధికారులు అడ్డు తగులుతున్నారు. విద్యుత్ లైన్లు వేయకుండా మోకాలడ్డుతున్నారు. సొంత డబ్బులతో స్తంభాలు పాతుకొని, బోర్లు వేసుకున్న వారినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా సాగు లేక పోడు భూములు బీడుగా మారుతున్నాయి.
– ఏటూరునాగారం, జూలై 10
అటవీహక్కుల చట్టం కింద గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు సాగునీటి వసతి లేక పంటలు పండించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల విభజన అనంతరం ఈ భూములను అభివృద్ధి పరిచి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు గిరి వికాసం పథకాన్ని అమలు చేసింది. దీంతో ఐటీడీఏ ద్వారా బోర్లు వేసి కరెంటు లైన్ ఇవ్వాలని అధికారులకు గిరిజనులు వినతిపత్రాలు ఇచ్చారు. కొందరు సొంతంగా బోర్లు వేసుకొని కరెంటు లైన్ కోసం ప్రయత్నాలు చేశారు.
అయితే అటవీశాఖ అధికారులు మాత్రం విద్యుత్ లైన్లు వేయకుండా అడ్డుపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో అటవీహక్కుల చట్టం కింద పంపిణీ చేసిన భూముల్లో ఇందిర జల ప్రభ పథకం కింద 2017లో వేసిన బోర్లకు సైతం ఇంతవరకు కరెంటు సరఫరా లేదు. రైతులు సొంతంగా కరెంట్ స్తంభాలు తెచ్చుకుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకొని వాటిని పట్టుకుపోయారు. తమ భూముల్లో బోర్లు వేసుకుని సాగు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని గిరిజనులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.
గిరిజనేతరులు పోడు సాగు చేసుకుని బోర్లు వేసుకుంటే పట్టించుకోని అటవీశాఖ అధికారులు తమను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం లేక వేల ఎకరాలు బీడుగా ఉంటున్నాయని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా పరిధిలో సుమారు 1,067 మంది గిరిజన రైతులు గిరివికాసం కింద బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకుని మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తమకు భూములు ఇచ్చినా నీటి వసతి లేకపోడంతో సాగు చేసేది ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన దర్బార్‌లో వినతులు సమర్పిస్తూనే ఉన్నామని అనేక మంది రైతులు చెప్తున్నారు.
కరెంటు స్తంభాలు ఎత్తి ఏడాది
నాకున్న పది ఎకరాల్లో బోర్లు వేసుకుని కరెంటు కోసం సొంతంగా డబ్బులు కట్టాను. స్తంభాలు కూడా నాటినం. వైర్లు లాగకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నరు. ఏడాదిగా ఐటీడీఏ అధికారులకు చెప్తూనే ఉన్నా. అటవీశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవించా. అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. నీళ్లు లేకపోవడం వల్ల పంటలు ఎలా సాగు చేయాలో తెలియడం లేదు. అధికారులు వెంటనే స్పందించి కరెంటు ఇప్పించాలి.
– సోయం రామనాథం, బండారుగూడెం
రెండేళ్లుగా తిరుగుతున్నా..
ఎనిమిది ఎకరాలకు పట్టా ఉంది. ఐటీడీఏ ద్వారా 2017లో ఇందిర జలప్రభ పథకం కింద బోరు వేశారు. ఇప్పటి వరకు కరెంటు సౌకర్యం కల్పించడంలేదు. ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. కరెంటు కోసం డీడీ కట్టుకున్నా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నరు. ఐటీడీఏ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. మా అమ్మ పేరిట నాలుగు ఎకరాలు ఉంది. దానికి కూడా నీటి వసతి లేదు.
– చింత నాగేశ్వర్రావు, శంకరాజుపల్లి
బోరుకు కరెంటు లేదు
ఆర్వోఎఫ్ఆర్ కింద నాలుగు ఎకరాల భూమి ఉంది. ఐటీడీఏ ద్వారా ఏడేళ్ల కింద బోరు వేశారు. కరెంటు సౌకర్యం కల్పించలేదు. పనిచేయని బోర్లతో పంటలు ఎలా పండించుకుంటం. రొయ్యూరులోని మారేడుకుంట చెరువు నుంచి నీళ్లు వస్తే పంటలు పండుతాయి. లేకుంటే లేదు. అది కూడా ఒకటే సీజన్‌కు. అధికారులు పట్టించుకుని బోర్లకు కరెంటు సౌకర్యం కల్పించాలి.
– తాటి కిష్టయ్య, శంకరాజుపల్లి