కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు ఆదివారం నాలుగో రోజు భక్తులు పోటెత్తగా, సరైన వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. విసుగు చెంది ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఐపీ ఘాట్ వద్ద సరిపడా చలువ పందిళ్లు లేక ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు విలవిలలా డారు.
పోలీసులు వీఐపీల సేవలో తరించగా, అధికారుల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, భక్తులు నానా పాట్లు పడ్డారు. మార్గమధ్యంలో తాగునీటికి తండ్లాడారు. కొందరు కాలినడకన కాళేశ్వరానికి చేరుకున్నారు. అధికారుల సమన్వయ లోపంతో అంతా అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– మహదేవపూర్(కాళేశ్వరం), మే 18
కాళేశ్వరం జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రద్దీకి అనుగుణంగా అధికారులు వసతులు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇసుకలో నడిచేందుకు నరకయాతన పడ్డారు. సూచికబోర్డులు ఏర్పాటు చేయకపోవ డంతో ఎటు వెళ్లాలో తెలియక భక్తులు అయోమయానికి గురయ్యారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తాగు నీటి కోసం అరణ్యంలో తండ్లాడారు. వాహనాలు దిగి జాతీయ రహదారి పక్కన ఉన్న జెన్కో పైప్ వద్ద లీకే జీ నీటితో దాహార్తిని తీర్చుకున్నారు. కొందరు బైక్‌లపై తిరుగుతూ ఒక్కో వాటర్ బాటిల్‌కు రూ. 50 వసూలు చేస్తూ భక్తులను దోచుకున్నారు. అరణ్యంలో నెట్ వర్క్సిగ్నల్ లేక ఇబ్బందులు పడ్డారు.
తమ వారి సమాచారం తెలియక బంధువులు హైరానా పడ్డారు.ఓ భక్తుడు వీఐపీ ఘాట్ వద్ద తవ్ర అస్వస్థతకు గురి కాగా, రెస్క్యూ టీం ఆసుపత్రికి తరలించింది. ఇదిలా ఉండగా పుష్కరాల్లో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడంతో బాధతులు లబోదిబోమన్నారు. కాగా, భక్తులు కాళేశ్వర అందాలను వీక్షించేందకే జాయ్ రైడ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కరికీ రూ.4500 చెల్లించి బుకింగ్ చేసుకోవాలన్నారు.
ప్రముఖుల పూజలు
వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో హైకోర్టు జడ్జి సుధ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌తో పాటు భక్తులు పుణ్య స్నానాలాచరించారు. సరస్వతీ మాతకు, సైకత లింగాలకు పూజలు చేశారు. నదీ మాతకు చీర, సారె, ఒడి బియ్యం సమర్పించారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. అనంతరం భక్తులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
ఎవ్వరూ పట్టించుకుంట లేరు
సరస్వతీ పుష్కరాల కోసం కుటుంబంతో కలిసి కాళేశ్వరం అచ్చినం. ఇక్కడ సౌలతులు సక్కగ లేవు. శాన ఇబ్బంది పడ్డం. గింత అధ్వాన్నంగ ఉంటదని అనుకోలే. గుడిల దర్శనానికే 4 గంటలు పట్టింది. అధికారులు ఎవ్వలు పట్టించుకుంటలేరు.
– శ్రీలక్ష్మి, భూపాలపల్లి
పుష్కరాల్లో అధికారులు ఫెయిల్
సరస్వతీ పుష్కరాల నిర్వహణలో అధికారులు ఫెయిల్ అయ్యారు. భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. పోలీసులు వీఐపీ దర్శనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గంటల కొద్దీ క్యూలైన్లో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా ఈవో పట్టించుకోకపోవడం సరికాదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– మహేశ్, మంథని