ఆత్మకూర్ జూన్ 14 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను హైదరాబాద్ హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైతన్య కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో గ్రామస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతి, నిర్మాణమునకు వాడుతున్న స్టీలు, సిమెంట్, ఇసుక వివరాలను లబ్ధిదారుల నుండి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఆత్మకూరు మండలంలోని మోడల్ హౌస్ నిర్మాణమును తిరుమలగిరి, ఆత్మకూరు, కామారంలో ఇంటి నిర్మాణ లబ్ధిదారులను కలసి వారితో ముఖాముఖిగా మాట్లాడారు.
గ్రామస్థాయిలో మేస్త్రీలు ఇంటి నిర్మాణంలో స్టీలు మోతాదుకు మించి వాడుతున్నట్లుగా గుర్తించి లబ్ధిదారులకు తగు సూచనలు జారీ చేశారు. అలాగే లబ్ధిదారులు అందరు కలిసి తక్కువ రేటులో సిమెంటు, స్టీలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అలాగే మేస్త్రీలు ప్రభుత్వము నిర్దేశించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేసిన యెడల ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, హౌసింగ్ డిప్యూటీ రవీందర్, ఎంపీడీవో ఎం శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ ఏఈ తేజ, పంచాయతీ కార్యదర్శి అనూష లావణ్య, శ్వేత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.