నర్సంపేట/ చెన్నారావుపేట/ సుబేదారి/ హనుమకొండ/ స్టేషన్‌ఘన్ పూర్/ చిల్పూరు/ జనగామ, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతితో నర్సంపేటలో హైటెన్షన్ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్‌గౌడ్ (55) గురువారం (ఈ నెల 23న) రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో కూర్చొని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడం లేదని తీవ్ర మనస్తాపం చెం ది నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ చల్లుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలోకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు మృతదేహాన్ని మల్లంపల్లి బైపాస్‌రోడ్డు మార్గంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ తీసుకొచ్చారు. దాదాపు 24 గంటల హైడ్రామా తర్వాత ముత్తోజిపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. శంకర్‌గౌడ్ దాదాపు 25 సంవత్సరాలు నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించారు. అతడికి భార్య హేమలత, కూతురు షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. కాగా, శంకర్ గౌడ్ మృతదేహం తరలింపు విషయంలో ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొలుత శంకర్‌గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు తోటి ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకర్‌గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత కార్మికుల కోరిక మేరకు మృతదేహాన్ని నర్సంపేటకు తరలించే విషయమై పోలీస్ ఉన్నతాధికారులతో పెద్ది చర్చించారు. వారు ఒప్పుకోకపోవడంతో ఏకంగా మృతదేహం ఉన్న స్ట్రెచర్‌ను పెద్ది తానే లాక్కుంటూ కొంత ముందుకు తీసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మళ్లీ మృతదేహాన్ని పెద్ది తరలిస్తుండగా డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి అడ్డుకొని బలవంతంగా పెద్దిని నెట్టుకుంటూ పోలీస్ వాహ నం ఎక్కించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనాల ముందు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పెద్దిని అరెస్టు చేసి నర్సింహులపేటకు, అక్క డి నుంచి ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి రాత్రి విడుదల చేశారు. ఆ తర్వాత వచ్చి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు నివాళులర్పించిన అనంతరం మృతదేహాన్ని డిపోకు తరలించేందుకు బండితో పాటు బీజేపీ కార్యకర్తలు యత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముత్తోజిపేటలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కాగా, తోటి డ్రైవర్ మృతి చెందడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట-మల్లంపల్లి ఎన్‌హెచ్-365పై వందలాది మంది కార్మికులు రాస్తారోకో చేశారు. సీఎం డౌన్..డౌన్ అంటూ నినదించారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. తోటి కార్మికుడిని కడసారి చూసేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకోవడం అన్యాయం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దు. బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండంగా ఉంటుంది. శంకర్‌గౌడ్ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో పెట్టి నివాళలర్పించకుండా పోలీసులు అత్యుత్సాహం చూపారు. – మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ బలిదానంపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. శుక్రవారం మధ్యాహ్నం నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారితో మాట్లాడారు. కుటుంబానికి తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుతోపాటు కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం, నర్సంపేట ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ.5లక్షలు అందిస్తున్నట్లు ఆర్డీవో ప్రకటించారు. ఈ సమయంలో కూడా కార్మికులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు నినాదాలు చేశారు.