హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పింది అమలు చేయాల్సి వస్తున్నదని, మాట్లాడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. దూబే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సంఘ్ పరివార్‌తోపాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విస్తరణలో తామిద్దరం కలిసి పనిచేశామని తెలిపారు.
రేవంత్‌రెడ్డి తనకు చాలా కాలంగా స్నేహితుడని చెప్పారు. ఏబీవీపీ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన ఆలోచనా విధానం సహేతుకంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ ఏం చెప్పుమంటే అదే మాట్లాడాల్సి వస్తున్నది.. ఇందులో రేవంత్‌రెడ్డి తప్పేమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన, 2017లో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య రాష్ట్ర, జాతీయ స్థాయిలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో దూబే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.