న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: వచ్చే లోక్‌సభ (2029) ఎన్నికల లోపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ర్టాల్లో యూసీసీ (ఉమ్మడి పౌరస్మృతి)ని అమలుజేయబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ పాలనలో ఉన్న 21 రాష్ర్టాల్లో యూసీసీని ప్రవేశపెడుతామని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ రద్దు, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మార్పులు, జాతీయ భద్రత సహా పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఉగ్రవాదం పట్ల ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు.
మణిపూర్‌లో ఎన్ఆర్సీపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని అన్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో యూసీసీని ప్రవేశపెట్టామని, 2029 లోక్‌సభ ఎన్నికల లోగా బీజేపీ నేతృత్వంలోని 21 రాష్ర్టాలు యూసీసీని స్వీకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ న్యాయ సంహిత ద్వారా ప్రభుత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. జాతీయ భద్రతపై మాట్లాడుతూ, 370 రద్దు రక్తపాతం లేకుండా జరిగిందన్నారు. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయటమే ‘యూసీసీ’.