కవాడిగూడ, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఆర్పీలను రెగ్యులరైజ్ చేస్తానని గత 2023 సెప్టెంబర్13న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఆర్పీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరావు డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ ఈనెల 13ను ప్రామిస్డేగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు సీఆర్పీ యూనియన్ తెలంగాణ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ యూనియన్ గౌరవ సలహాదారు బాలరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ.. సీఆర్పీలను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించాలని కోరారు. ఏటా టెర్మినేషన్ చేసి రీఅపాయింట్మెంట్ చేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్పీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 20 లక్షలతోపాటు పెన్షన్ చెలించాలని కోరారు. ప్రావిడెంట్ ఫండ్‌తోపాటు హెల్త్‌కార్డులను ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే సీఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలని, సమానపనికి సమాన వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.