సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో అక్రమాలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు బల్దియా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదురొంటుంటే, మరోవైపు కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు క్లెయిమ్ చేయడం, ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు జరపడమే కాకుండా.. ఒక సరిల్కు మంజూరైన పనులను మరో సరిల్లో చూపి బిల్లు తీసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
చార్మినార్ జోన్ పరిధిలోని వార్డు నంబర్ 28 అజంపురాకు మంజూరైన బాక్స్ డ్రెయిన్ పనులను వార్డు నంబర్ 26 ఓల్డ్ మలక్‌పేటలో చేపట్టినట్లు చూపి బిల్లులు క్లెయిమ్ చేశారు. ఒక సరిల్లో టెండర్లు నిర్వహించి మరో సరిల్లో పనులు పూర్తి చేశామనడాన్ని బల్దియా విజిలెన్స్ విభాగం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాలని చార్మినార్ ఇంజినీరింగ్ వింగ్‌కు విజిలెన్స్ అధికారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పనుల ప్రణాళికను కాగితాలకే పరిమితం చేసి, ప్రజాధనాన్ని దారిమళ్లించారా? లేక అనుమతులు లేకుండానే స్థల మార్పిడి పేరిట నిధులు డ్రా చేశారా? అన్న కోణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపడుతున్నది.
ఓల్డ్ మలక్‌పేట్, అజంపురా డివిజన్లలో మొదట ఖరారు చేసిన భారత్ పెట్రోల్ పంప్ .. నుండి హెచ్నెం. 16-8-731/92 మార్గంలో 1200 ఎంఎంఎన్పీ 4 పైప్ డ్రెయిన్, ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ పనులను అధికారులు మంజూరు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఏకంగా సైట్‌నే మార్చేసి 16-9-335/సీ ఖాగాజ్ కార్ఖానా నుంచి 16-9-829 శంకర్‌నగర్‌లోని మసీద్-ఇ -ఇదారియా మిల్యా వరకు పనులను మళ్లించడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ మార్పుల వెనుక అధికార దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ సేకరించిన ప్రాథమిక వివరాల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థల మార్పిడికి సంబంధించిన ఈఆర్పీ వోచర్ (నంబరు 24003197) వివరాలపై సమగ్ర విచారణ జరుపుతున్నది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జీవో ఎంఎస్ నెం.504 నిబంధనలకు అనుగుణంగా చార్మినార్ సరిల్-28 ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగం అన్ని రికార్డులతో నివేదిక ఇవ్వాలని అదనపు ఎస్పీ (విజిలెన్స్) ఆదేశించడంతో బల్దియా అధికారుల్లో వణుకు మొదలైంది.
పనుల నాణ్యతను తనిఖీ చేయాల్సిన క్వాలిటీ సెల్ విభాగం జీహెచ్ఎంసీలో ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. గోలిపురాలో ఇటీవల నిర్మించిన బాక్స్ డ్రెయిన్ చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పునర్నిర్మించాల్సి వచ్చింది. రూ.10 లక్షలు దాటిన పనులనే తనిఖీ చేస్తామని అధికారులు జారుకుంటున్నారని, గత రెండేండ్లుగా ఏ ఒక పనిలోనూ నాణ్యతా లోపాలను క్వాలిటీ సెల్ గుర్తించకపోవడంలో విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఫైనాన్షియల్ అడ్వైజరీ వింగ్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం సంచలనం సృష్టించింది. దాదాపు రూ.100 కోట్ల వరకు డబుల్ బిల్లుల చెల్లింపులు జరిగిన మాట వాస్తవమేనని బల్దియా కమిషనర్ అంగీకరించినప్పటికీ, చర్యలు మాత్రం కంటితుడుపుగానే మిగిలాయి. ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రను మాతృశాఖకు సరెండర్ చేసి చేతులు దులుపుకున్నారు. గతంలో ఐఎస్ సదన్ డివిజన్లో రూ.10 లక్షల రోడ్డు పనుల అక్రమాలపై ఇంజినీర్‌ను సస్పెండ్ చేసి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టిన అధికారులు.. రూ.100 కోట్ల మళ్లింపులో రికవరీ గానీ, క్రిమినల్ కేసులు గానీ నమోదు చేయకపోవడం వెనుక భారీ మంత్రాంగమే నడిచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.