ముంబై: ‘ఈ20’ ఇంధన విధానం అమలును నిలిపివేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దుచేయాలని, దేశవ్యాప్తంగా మూఢనమ్మకాలు, చేతబడి వంటివాటికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, కార్యకర్తల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ముంబైలో జరిగిన ‘ఇండియా మార్చ్ ఫర్ సైన్స్’ సందర్భంగా పలువురు మేధావులు సంయుక్తంగా ప్రభుత్వానికి ఈ విజప్తి చేశారు. మూఢాచారాల ప్రచారం, విద్యాపరిశోధన రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడానికి నిరసనగా వారు సంతకాల కార్యక్రమం చేపట్టారు.
ఈ విజ్ఞప్తిపై సీఈబీఎస్, ముంబైకి చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఎంఎస్ రఘునాథన్, బ్రేక్‌థ్రూ సైన్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ఎస్బీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఎస్ జీ దాస్ తదితరులు సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘ఇండియా మార్చ్ ఫర్ సైన్స్’ 1917లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 నగరాల్లో జరిగిన నిరసనల నుంచి ప్రారంభమైంది. ఈ20 ఇంధన విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరిన ఈ బృందం ఈ విధానం అమలుకు అవసరమైన మౌలిక వసతులు తగినంతగా లేకపోవడాన్ని ప్రస్తావించింది. బయో ఫ్యూయల్ ఉత్పత్తి కోసం అధిక నీరు అవసరమయ్యే ఆహార పంటను మళ్లించడం ఆహార భద్రతకు ముప్పు కలిగించడంతోపాటు భూగర్భ జలాల నిల్వలను తగ్గిస్తుందని హెచ్చరించింది.