సిటీబ్యూరో/మేడ్చల్ కలెక్టరేట్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత అధిక సంఖ్యలో నోటీసులు జారీ అయితే, దరఖాస్తుల వేగవంతమైన పరిషారం కోసం అదనపు ఏఈఆర్ఓలను (ఏఈఆర్వోలు) విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం నవీన్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. అమీర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శివభాగ్లో ఉన్న 139వ పోలింగ్ కేంద్రాన్ని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమన్ హౌసింగ్ కాలనీలోని 81వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేయాలని భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) సెక్రటరీ నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్ పురోగతిపై మేడ్చల్ కలెక్టరేట్లో కలెక్టర్ మను చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. అధికారులు బాగా పనిచేస్తున్నప్పటికి ఇతర జిల్లాలతో పోలిస్తే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సర్ ప్రక్రియలో వెనుకబడి ఉందని అన్నారు.
గడువును సద్వినియోగం చేసుకొని సర్ ప్రక్రియను వీలైనం త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గంలోని తిమ్మాయిపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లిలలో సర్ ప్రక్రియ తీరును నీవన్ కుమార్ పరిశీలించారు.అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ మాలతి, అధికారులు వెంకట్ రెడ్డి, సంచిత్ గంగ్వార్, పింకేష్ కుమార్, రాధికా గుప్తా తదితరులు పాల్గొన్నారు.