నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా, పలుచోట్ల వరి తదితర పంటలు నేలవాలాయి. పలు గ్రామాలు విద్యుత్ లేక అంధకారంలో ఉన్నాయి. వరంగల్ నగరంలోని పలు ప్రాంతంలో వర్షం దంచికొట్టింది. భారీగా వీచిన గాలులకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లె నుంచి రంగాపురం వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు కూలింది. జనగామ మండలంలోని సిద్దెంకి, పెంబర్తి గ్రామాల్లో స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరి, పత్తి, కురగాయల పంటలు దెబ్బతిన్నాయి. మండంలోని చిన్నపెండ్యాల, నష్కల్, రాజవరం, పల్లగుట్టతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవడంతో పత్తి, మక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే ములుగు జిల్లా కేంద్రంతో పాటు ములుగు మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది.
మల్లంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలోని చెట్టుపై పిడుగుపడి చెట్టు చీలిపోయింది. పాఠశాలకు దసరా సెలవులు కావడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడగా, పలువురి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో ఉన్న సుమారు 100 ఏళ్ల నాటి భారీ చింత చెట్టు నేలకూలింది.
బోరునర్సాపురం-చెరుపల్లి రోడ్డుపై చెట్లు విరిగి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వెంకటాపూర్ మండలంలోని పాలంపేట- వెంకటాపూర్ రహదారిలో చెట్లు కూలడంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేట, ఆత్మకూరు మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలకొట్టు వద్ద చెట్టు విరిగి 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడడంతో విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే ముల్కలపల్లి వద్ద విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అలాగే నర్సింహులపేట, నెల్లికుదురు, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం భారీ వర్షం కురిసింది.