నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్12 : ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం అక్కడక్కడా వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మత్తళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి నీళ్లు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు-హనుమకొండ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కటాక్షపురం పెద్ద చెరువుకు మళ్లీ మత్తడి పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భీమదేవరపల్లి మండల కేంద్రం శివారులో దేవాదుల ప్రాజెక్టు ఉపకాల్వకు గండి పడడంతో పంటపొలాలు నీట మునిగాయి.
సంబంధిత అధికారులు కెనాల్ నీటి సరఫరాను నిలిపివేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్కతుర్తికి చెందిన గాజుల రాకేశ్ హు జూరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. విధు లు ముగించుకొని తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో జీల్గుల నుంచి గోపాల్‌పూర్‌కు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో తాళ్ల వాగు వరద ఉధృతికి నీటిలో పడిపోయా డు. కొంతదూరం కొట్టుకపోయిన తర్వాత కల్వర్టు పిల్లర్‌ను పట్టుకొని కాపాడాలని గట్టిగా అరిచాడు. అటుగా వచ్చిన ఇదే గ్రామానికి చెందిన బోయినపల్లి కిషన్‌రావుకు అరుపులు వినపడడంతో 100కు డయల్ చేశాడు.
వెంటనే ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని తాడుతో వాగులోకి దిగి బాధితుడిని కాపాడారు. కరీంనగర్‌లోని మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో టేకుమట్ల మండలం కలికోట పల్లి శివారులోని మానేరు వాగులో 9 ట్రాక్టర్లు, డ్రైవర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న టేకుమట్ల ఎస్సై సుధాకర్, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్సై శ్రవణ్‌కుమార్, తహసీల్దార్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో ముగ్గ్గురు డ్రైవర్లను ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో నలుగురిని కానిస్టేబుల్ మహేందర్, హెడ్ కానిస్టేబుల్ సతీశ్ వాగులో నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లపై నుంచి సాహసించి తాళ్లు పట్టుకొని దాదాపు 200 మీటర్ల వరకు వెళ్లి వారిని కాపాడారు.
దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీసులను అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీవో రవి, సీఐ మల్లేశ్, స్థానికులు అభినందించారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి శివారులోని కన్నె చెరువు కట్టకు బుంగ పడగా, రైతులు ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. జనగామ మండలంలోని గానుగుపహాడ్ గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద తాత్కాలిక కాల్వర్టు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డ గోదావరి తీర ప్రాంతంలో పిడుగు పాటుకు గురై 94 గొర్రెలు మృ తి చెందాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితులు వేడుకున్నారు.