ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలసత్వం.. రైతుకు శాపంగా మారింది. సాగునీరు అందకపోయినా ఎంతో శ్రమకోర్చి పండించిన పంటలను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి కాంటా పెట్టకపోవడంతో అకాల వర్షానికి ధాన్యమంతా వరదపాలవుతున్నది. కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయకపోవడంతో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ కొట్టుకుపోయి రైతులకు కన్నీరే మిగిల్చింది.
మొన్నటిదాకా అదునుకు సాగునీరందించక అరిగోస పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్రాల్లో కోతలు, కొర్రీలు తప్ప కనీస వసతులు కల్పించకపోవడమే గాక సమయానికి కాంటాలు పెట్టక తమను నిండా ముంచిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కాంటాలు పెట్టడంతో పాటు తడిసిన ధాన్యమూ కొనాలంటూ పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునేందుకు సైతం అవస్థలు పడాల్సి వస్తున్నదని, తమ కష్టం అధికారులకు పట్టదా? తమను నిండా ముంచేస్తారా? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం ఎందుకని, వెంటనే కాంటాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని మండిపడ్డారు.
డబ్బులిచ్చిన భూస్వాములకు మాయిశ్చర్ రాకున్నా ఒకటి, రెండు రోజుల్లో కాంటాలు పెడుతున్నారని, తమలాంటి చిన్న రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నా రు. ఇందులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి, సింగరకుంటపల్లికి చెందిన రైతులు పాపయ్యపల్లి కొనుగోలు కేంద్రం లో వెంటనే విక్రయాలు చేపట్టాలని ములుగు-భూపాలపల్లి రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జాం కావడంతో స్థానిక ఎస్సై సతీశ్ అక్కడకు చేరుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అలాగే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో మండల కేంద్రానికి చెందిన రైతు అంకం నాగయ్య ఆందోళనకు దిగాడు. ఐదు రోజుల క్రితం తేమ 13 శాతం ఉందని చెప్పి ఇప్పటికీ కాంటాలు పెట్టడం లేదని ఆరోపిస్తూ వడ్ల కుప్పపై సానిటైజర్ చల్లి తగుల బెట్టేందుకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. గన్నీ బస్తాలు లేవని, టోకెన్లు ఇవ్వాల్సిన ఏఈవోలు అందుబాటులో ఉండడం లేదంటూ సిబ్బందిని నిలదీశారు. కేంద్రంలో వసతులు కల్పించాలని, డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని కాంటాలు పెట్టాలని డిమాండ్ చేశారు.