నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. క్షణం కూడా గెరువివ్వకపోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రోడ్లపై వరద ఉధృతికి ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేలమట్టమయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలో మోస్తరుగా వర్షం కురవగా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్నది. బయ్యారం మండలంలోని పెద్దచెరువు గరిష్ఠ నీటిమట్టం 16.5 అడుగులు కాగా, అడుగు మేర మత్తడి పోస్తుంది.

వినోబానగర్‌లోని తులారం ప్రాజెక్ట్, గౌరారం, వట్టెవాగు కట్టు మత్తడి దుంకుతున్నాయి. బయ్యారం పెద్దగుట్టపై పాండవుల జలపాతం, చింతోనిగుంపులోని వంకమడుగు జలపాతం జాలువారుతున్నాయి. మసివాగు, పంది పంపుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గార్ల సమీపంలోని పాకాల ఏరు ఉప్పొంగుతున్నది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కోసం 8712656928 నంబర్లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం ఆలుబాక పరిధి తానిపర్తి గ్రామానికి చెందిన బానారి రాజు(45) గురువారం గోదావరి నదిలోకి చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. అతడి మృతదేహం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం సున్నంబట్టి రేపు సమీపంలోని దొరికింది.
ఏటూరునాగారం/వెంకటాపురం(నూగూరు): ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామంలోని ఇద్దరు గర్భిణులు పులిశె అనూష, దబ్బగట్ల శైలజను బోటు ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొండాయి గ్రామంలో ఫిట్స్‌కు గురైన వృద్ధురాలు మాదాటి పోషమ్మను ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో దొడ్లవాగు ఒడ్డుకు చేర్చి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు.
అలాగే వెంకటాపురం(నూగూరు) మండలం ఎదిరా పీహెచ్సీ పరిధిలోని 9 మంది గర్భిణులు వైద్యాధికారి భవ్యశ్రీ ఆధ్వర్యంలో 102 వాహనలో మండలం కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. ముంపు గ్రామాలైన ముకునూరుపాలెం, కాలిపాక, ఆర్సీపురం, పాత్రాపురం, అంకన్నగూడేనికి చెందిన గర్భిణులు లలిత, సుగుణ, భారతి, స్వరూప, కావ్య, అమల, శివాణి, ఆదిలక్ష్మి, లలితను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

గణపురం : మండలంలోని అప్పయ్యపల్లి, వెళ్తుర్లపల్లి గ్రామాల మధ్యలోని మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో మండల కేంద్రానికి వాగు అవతలి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
గోవిందరావుపేట : గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నీటి మట్టం 33.5 అడుగులు కాగా, శనివారం సాయంత్రం నాటికి 18.6 అడుగులకు చేరుకుంది.
కాళేశ్వరం వద్ద గోదావరి నది 4 లక్షల క్యూసెక్కులతో 09.01 మీటర్ల ఎత్తులో, ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 12.210 మీటర్లు, వాజేడు మండలం పేరూరు వద్ద 13.140 మీటర్లు ఎత్తులో పారుతున్నది. చీకుపల్లి అటవీప్రాంతంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సుమారు 50 అడుగులపై నుంచి పాలసముద్రంలా జాలువారుతున్నది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పర్యాటకులు బొగత అందాలకు ఫిదా అయ్యారు.
శనివారం ములుగు జిల్లాలో 39.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా వెంకటాపూర్(నూగూరు)లో అత్యధికంగా 75.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 25.8 మిల్లీమీటర్ల కాగా, అత్యధికంగా రేగొండ మండలంలో 40.4మి.మీ, జనగామ జిల్లాలో 10.7మి.మీ కాగా, అత్యధికంగా కొడకండ్లలో అత్యధికంగా 15.4 మిమీ కురిసింది. అలాగే మహబూబాబాద్ జిల్లా సగటు వర్షపాతం 39.2 మిమీ కాగా, అత్యధికంగా బయ్యారం మండలంలో 71 మి.మీ, వరంగల్ జిల్లా సగటు వర్షపాతం 24.9 మిమీ కాగా, ఖానాపూర్ మండలంలో 28.4 మిల్లీమీటర్లు, హనుమకొండ జిల్లా సగటు వర్షపాతం 16.30 మిల్లీ మీటర్లు కాగా, అత్యధికంగా ఆత్మకూరు మండలంలో 24.50 మిల్లీమీటర్లుగా నమోదైంది.