హనుమకొండ సబర్బన్, జూలై 30 : రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆశలు చిగురించాయి. పొలాలు దున్నేందుకు సిద్ధ్దమవుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగంలో నిరుత్సాహం నెలకొంది. వరి పంటను అసలే వేయొద్దని కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచనలు చేసింది. అయితే వరి పంట విషయంలో ఉమ్మడి జిల్లాలో రైతులు వెనక్కి తగ్గేదిలేనట్లుగా నార్లు పోసుకున్నారు.
ఆలస్యంగానైనా వానలు కురవకపోతాయా అని భావించారు. అయితే వరుణుడి చూపు లేకపోవడంతో కనీసం ఆరుతడి పంటలకు కూడా అవసరమయ్యే స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో బావులు, బోర్లు అందుబాటులో ఉన్న రైతులు కొద్ది మేరకు పంటలు వేసుకున్నప్పటికీ నీరు దినదినం అడుగంటిపోవడంతో ఉన్న పంటలను రక్షించుకునేదెలా.. అని మీమాంసలో పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతువేదికల్లో ఆరుతడి పంటలను వేసుకోవాలని కందులను, పెసర్లను, ఇతరాత్రా కూరగాయల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లుగా రైతు మేళాలను ఆర్భా టంగా నిర్వహించారు. అయితే ఇదే తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రెండు రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది.
స్వల్పంగా వర్షం కురుస్తుండడంతో రైతుల్లో వరి పొలాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఈ ముసురు వర్షంతో రైతుల్లో ఆశలు చిగురించి పొలం మడులు దున్నుతున్నారు. ఆరుతడి పంటలతో లాభాలు తక్కువ, ఖర్చు ఎక్కు వ అనే సందేహాలతో కర్షకులు మళ్లీ వరి పొలాల బాట పట్టారు. కొద్ది మేరకు వరద సాగే వాన పడినట్లయితే వానకాలం పంటకైనా ఇబ్బందులు లేకుండా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. అయితే వాతావరణ శాఖ నిపుణులు మాత్రం ప్రస్తుత ముసురుతోనే మన ప్రాంతానికి వర్షం ముగిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి వైపు మొగ్గు చూపాలా.. నారుమడుల వైపు వెళ్లిపోవాలా అనే సందేహాలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
హనుమకొండ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా 67 శాతం లోటుతో ఎల్కతుర్తి, 66 శాతం లోటుతో ఆత్మకూరు మండలాలు తీవ్ర దుర్భిక్షంలో పూరుకపోయాయి. జిల్లాలో 2.38 లక్షల సాగు భూమి ఉండగా గత ఏడాది పూర్తిస్థాయిలో పంటలు సాగయ్యాయి. సుమారు 1,48,540 ఎకరాల్లో వరి, 5,036ఎకరాల్లో మక్కజొన్న, 84,443ఎకరాల్లో పత్తి పంట సాధారణంగా ఉంటుంది. ఈసారి మాత్రం వర్షాభావ పరిస్థితి మూలంగా 44,061 ఎకరా ల్లో వరి , 6,518 ఎకరాల్లో మక్కజొన్న, 72,250ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతానికైతే జిల్లాలో 68,500 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ ముసురుతో వరినాట్లు లక్ష ఎకరాల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక వేళ రానున్న రోజుల్లో వర్షాలు పడని పక్షంలో వేసిన వరి కూడా పూర్తిగా కొనసాగే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.