సంగారెడ్డి, జూలై 30(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,57,246 ఎకరాల్లో పత్తి, 72885 ఎకరాల్లో కంది, 71283 ఎకరాల్లో సోయా, 7757ఎకరాల్లో మొక్కజొన్న, 8002 ఎకరాల్లో పెసర, 6250 ఎకరాల్లో మినుము, 17289 ఎకరాల్లో చెరుకు పంటలు సాగు చేశారు.
ఎల్‌నినోతో వర్షాలు పడవని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరించడంతో రైతులు కొద్ది రోజులుగా ఆందోళనలో ఉన్నారు. కాగా, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటలు ఎదుగుతున్న సమయంలో వర్షాలు పడటంతో సంబుర పడుతున్నారు. వర్షాలతో పత్తి, పెసర, మినుము, సోయా, కంది తదితర పంటలకు జీవం పోసినట్లు అయ్యింది. వర్షాలు కురియకపోతే ఆరుతడి పంటలు ఎడిపోయి రైతులకు నష్టం జరిగేది.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాలో హెచ్చరికల నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టరేట్లో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ (08455-276155) ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్, వైద్య, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. వర్షాలతో ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
సిర్గాపూర్, జూలై 30: మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో కుంటలు, చెక్‌డ్యాం, వాగులు పొంగిపొర్లాయి. చెరువుల్లో భారీగా వరద చేరింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని వంగ్ధాల్, వాసర్, పొట్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది.

వంగ్ధాల్ శివారులో వాగు జోరుగా ప్రవహించడంతో వంగ్ధాల్ నుంచి గైరాన్తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పొట్పల్లి, సిర్గాపూర్, వాసర్, వంగ్ధాల్ వాగులు జోరుగా పారుతూ దిగువన నల్లవాగు ప్రాజెక్టులో కలిశాయి. ఒక్క రోజులోనే రెండు అడుగుల నీరు చేరింది. ప్రాజెక్టు లెవల్ 1494 అడుగులకు 1485 అడుగుల వద్ద స్టోరేజ్ ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో గురువారం సరాసరి 16.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 4.7 సెం.మీటర్లు, సిర్గాపూర్‌లో 4.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. కల్హేర్, మనూరు, నాగల్గిద్ద మండలాల్లో 2.5 సెం.మీటర్ల నుంచి 2 సెం.మీటర్ల వర్షం కురిసింది. ఈనెల ప్రారంభంలో జిల్లాలో వర్షపాతం లోటుగా ఉంది. జూలైలో 18.5 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈనెల 20 వరకు 87 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పదిరోజులు జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. గురువారం వరకు జిల్లాలో 18.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 1.6 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది.
మూడు రోజుల్లో సింగూరు ప్రాజెక్టులోకి 517 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు మరమ్మతు నేపథ్యంలో 470 క్యూసెక్కుల జలాలు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 4.249 టీఎంసీల జలాలు ఉన్నాయి. నల్లవాగు ప్రాజెక్టులోకి 214 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1484 ఫీట్ల మేర జలాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1773 చెరువులు ఉన్నాయి. 945 చెరువుల్లోకి 25 శాతం, 89 చెరువుల్లోకి 50 శాతం నీళ్లు వచ్చాయి. 16 చెరువులు వర్షం నీటితో నిండగా, రెండు చెరువులు అలుగు పారుతున్నాయి. సిర్గాపూర్ మండలంలోని వంగ్థాల్ వాగు పొంగి ప్రవహిస్తుండడంతో వంగ్థాల్, గైరాన్ తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి.