మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలకు మానుకోట జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లను, పంటలను ఊడ్చుకెళ్లి నిండాముంచడంతో ప్రజలకు కన్నీళ్లే మిగిల్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం వరకు వాన తగ్గినా.. వరద మాత్రం తగ్గలేదు. వాగుల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మహబూబాబాద్ నుంచి గూడూరుకు వెళ్లే రోడ్డు మార్గం తప్ప మిగిలిన దారులన్నీ కట్ అయ్యాయి. జిల్లాకేంద్రం నుంచి మరిపెడకు వెళ్లే జాతీయ రహదారి 365 పూర్తిగా దెబ్బతింది.
మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం వద్ద సుమారుగా పది చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో జిల్లాకేంద్రం నుంచి వయా మరిపెడ మీదుగా సూర్యాపేట, ఖమ్మం వెళ్లాల్సిన ప్రజలు ఆగిపోయారు. అలాగే జిల్లాకేంద్రం నుంచి నెల్లికుదురు మీదుగా తొర్రూరుకు వెళ్లాల్సిన మార్గంలో మునిగలవీడు-మదనతుర్తి మధ్య ఉన్న మోరీ వద్ద రోడ్డు వరదకు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు వెళ్లడం లేదు. జిల్లాకేంద్రం నుంచి వయా కురవి, డోర్నకల్ మీదుగా ఖమ్మం వెళ్లాల్సిన రోడ్డు కూడా పూర్తిగా కోతకు గురైంది. డోర్నకల్ మండలం ముల్కలపల్లి వద్ద బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి.
దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇంటికన్నె వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్ పనుల కోసం 500మంది సబ్బంది, కార్మికులు పని చేస్తున్నారు. 15మంది అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రైళ్లు నడిచేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇటు రైలు మార్గం, అటు రోడ్డు మార్గాలు బంద్ కావడంతో ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం, మరిపెడ మండలం సీతారాం తండాలు భారీ వరదకు నీట మునిగి, ఇళ్లలోకి నీళ్లు పోయి నిత్యాసవరాలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఈ రెండు గ్రామాల ప్రజల దీనస్థితి అంతా ఇంతాకాదు.
భారీ వరదల కారణంగా జిల్లావ్యాప్తంగా 10 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోగా, మరో పది చోట్ల రోడ్లు కట్ అయ్యాయని వీటి మరమ్మతులకు కనీసం రూ.2 కోట్లు అవసరమని ఆర్అండ్బీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ వరదల కారణంగా 16,810 ఎకరాల్లో వరి పంట, 5,764 ఎకరాల్లో పత్తి, 2,796 ఎకరాల్లో మక్కజొన్న, ఇతర పంటలు 2,172 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ అధికారులు గుర్తించారు.
ఇవికాకుండా ఉద్యాన పంటలు, బొప్పాయి, ఇతర కూరగాయలు 675 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే పరిమితమయ్యారు. అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి సీతక్క జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించడంతో కొంతమంది అధికారులు మంత్రి వెంట ఉండిపోయారు. ఇక ప్రజలు ఇబ్బందులు మాత్రం పట్టించుకున్న అధికారులు కరువయ్యారు.
ఖిలావరంగల్, సెప్టెంబర్ 2: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే వరంగల్ రైల్వే స్టేషన్ సోమవారం బోయిపోయి కనిపించింది. ఇంటికన్నె, కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ కొట్టుకుపోవడం తో ఈ మార్గాన్ని పూర్తిగా మూసి వేశారు. వరంగల్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించడం తో రైల్వేస్టేషన్ వెలవెలబోయింది.