వేలేరు : మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. వేలేరు మండల వ్యాప్తంగా అకాల వర్షంతో అన్నదాతలు ఆగమైపోయారు. కొన్ని గ్రామాల్లో రాళ్ల వర్షం సైతం కురిసింది. మామిడి తోటలు, మొక్కజొన్న పంటలు, వరి పొలాలు నేలకొరిగాయి. వేలేరు మండలంలోని శాలపల్లి, మల్లికుదుర్ల, గుండ్ల సాగర్ గ్రామాల్లోని పలువురు రైతులు గాలివాన బీభత్సానికి తీవ్రంగా నష్టపోయారు. గుండ్లసాగర్ గ్రామానికి చెందిన పల్లా సురేందర్ రెడ్డి, మల్లికుదుర్ల కు చెందిన బట్టు అంజయ్య అనే రైతుల మామిడితోటలు కాయలు కోసే దశలో ఉండగా నిన్న కురిసిన అకాల వర్షానికి మామిడికాయలు మొత్తం నేల రాలాయి.
దీనితో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు చెరో రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లిందని, సుమారు 50 చెట్లు కూలిపోయాయని చెప్పారు. మామిడి తోటను బుధవారం ఉద్యానశాఖ అధికారి సుష్మ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని తెలిపారు. కాగా, రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని కోరారు.