నమస్తే నెట్వర్క్, మే 17: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో రైతు కష్టం వర్షార్పణం అయ్యింది. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు, శుక్రవారం కురిసిన వానతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. సకాలంలో కొనకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది.
అనేక చోట్ల వరదలో వడ్లు కొట్టుకుపోయాయి. వారం పది రోజులుగా కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోస్తూ కాపాడుకున్న రైతులు, ఇప్పుడు వాన నుంచి రక్షించుకునేందుకు తిప్పలు పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తమకీ దుస్థితి వచ్చిందని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కురవి మండలం తాట్యాతండా వద్ద రైల్వేగేటు వద్ద రోడ్డుపై భారీగా వర్షం నీరు చేరడంతో రోడ్డుకు గండిపెట్టారు. గార్ల మండలం రాంపూర్ చెక్‌డ్యాం నుంచి వరద పొంగిపొర్లడంతో 15 గ్రామాలకు మండల కేంద్రానికి రాకపోకలు బందయ్యాయి.
మహబూబాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు కేంద్రాల కు తీసుకొస్తే రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. భారీ వర్షం కురిసి వడ్లన్నీ తడిసిపోయాయి. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. బయ్యారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి పందిపంపుల వాగు, మసివాగు ప్రవహిస్తుండడంతో బయ్యారం పెద్దచెరువులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. డోర్నకల్ మండలంలో కురిసిన భారీ వర్షంతో పాటు పైనుంచి వస్తున్న వరదతో పలు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరదనీరు వచ్చి చేరుతుంది. జిల్లా సగటు వర్షపాతం 70.8 మిల్లిమీటర్లుగా నమోదైంది.
నెల రోజుల కింద ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చినం. వానలు పడుతున్నా ఎవ్వలు దిక్కులేరు. తేమ వస్తలేదని వంకలు పెడుతున్రు. అధికారులు వచ్చుడు లేదు. వడ్లను చూసుడు లేదు. ఏం చూడకుండానే తేమ ఎక్కువుందని అంటున్రు. తెలిసిన వాళ్ల వడ్లు కొంటాన్రు. రెండు రోజులు ఎండబోసుడుతోనే మల్ల వాన పడ్తాంది. ఇన్ని రోజుల నుండి ఫోన్ చేస్తే రాలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే రాత్రి వానే పడే తేమ శాతం ఏడ వస్తది మళ్ల ఎండబోయి అంటున్రు. వానకు వడ్లన్నీ తడిసినయ్. ఇప్పటికే మొలకలొస్తున్నాయి.
– మాడబోయిన దేవేందర్, రైతు, జంగాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి, మే 17 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లు ఇప్పటి వరకు అధికారులు కేవలం 16,204 టన్నులే కొనుగోలు చేశారు. సుమారు లక్ష టన్నులు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 116 కేంద్రాల ద్వారా 16,204 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా 73 కేంద్రాలను ప్రారంభించలేదు. ఈ ధాన్యాన్ని కాటారం, కొయ్యూరు, గొర్లవీడు, చిట్యాల, గణపురానికి చెందిన ఆరు మిల్లులతో పాటు వరంగల్‌లోని మిల్లులకు సరఫరా చేశారు.
ఇంకా కొనుగోలు కేంద్రాల్లో నాలుగు వేలకు పైగా టన్నుల ధాన్యం ఉండగా, ఇంకా వస్తోంది. మరో పదిహేను రోజుల్లో ధాన్యం మొత్తం కల్లాల్లో నుంచి లిప్టు చేయాల్సి ఉంది. వర్ష ప్రభావం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటోంది. జిల్లాలో ఇంకా 80 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కల్లాల్లో ధాన్యం తడిసిపోగా గురువారం కురిసిన వర్షానికి కేంద్రాలు నీటిమయ మయ్యాయి. శుక్రవారం వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కేంద్రాల్లో రైతులు ధాన్యం కాపాడుకునేందుకు అవస్థలు పడుతూనే ఉన్నారు.
ములుగు, మే17(నమస్తేతెలంగాణ): అధికారులు తేమ శాతం పేరుతో పెట్టిన కొర్రీలతో 20 రోజులుగా రైతులు ధాన్యాన్ని ఆరబోశారు. గురువారం రాత్రి నుంచి వర్షం కురిసి వడ్లు నీటి పాల య్యాయి. నిబంధనల ప్రకారం తేమ శాతం రావడం లేదంటూ కేంద్రాల నిర్వాహకులు వంకలు చెప్పగా రైతులు చేసేదేమీ లేక ధాన్యాన్ని ఆరబోయగా వరుణుడి పాలైంది. రాత్రి నుంచి ధాన్యం రాసులపై పరదాలు కప్పుతూ వర్షానికి తడుస్తూ రైతులు కల్లాల వద్ద ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్తాల్లో నింపిన ధాన్యం సైతం తడిసిపోవడంతో మళ్లీ ఆరబెట్టారు. ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్, మంగపేట, ఏటూరునాగారం, ములుగు, వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం మండలాల్లో రైతుల ధాన్యం తడిసి ముద్దయ్యింది.
హసన్‌పర్తి మండలం రెడ్డిపురం, వంగపహాడ్, బైరాన్‌పల్లి, సిద్ధారెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, నడికూడ మండలం కంఠాత్మకూర్ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. మక్కజొన్న గింజలు తడవగా, వాటిని ఆరబోసేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు.