తాడ్వాయి, జనవరి 25: మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం ఆదివారం లక్షలాదిగా తరలివచ్చారు. వరాలిచ్చే దేవతలుగా వెలుగొందుతున్న తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. జాతర పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మేడారం-పస్రా, మేడారం-తాడ్వాయి రహదారుల వెంట చెట్లకింద భక్తులు విడిది చేశారు. ప్రకృతి ఒడిలో వంటలు చేసుకొని విందుభోజనాలు చేస్తూ ఇళ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు.
ఏటూరునాగారం : మేడారం సమీపంలోని వీఐపీ పార్కింగ్ మూలమలుపు వద్ద వాహనాల మళ్లింపుతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో తాడ్వాయి దారిలో కొన్నిసార్లు కిలోమీటర్ మేర ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఎక్కువ దూరం వరకు నిలిచిపోతున్నాయి. వీఐపీ మూలమలుపు వద్ద వాహనాలను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.